
ఐఎంఏ గుంటూరు అధ్యక్షుడిగా డాక్టర్ సేవ కుమార్
గుంటూరు మెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుంటూరు శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ తాతా సేవకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని జీఎంఏ హాల్లో నిర్వహించిన 2025–2026 కార్యవర్గం ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా డాక్టర్ ఎం.శివప్రసాద్, కార్యదర్శిగా డాక్టర్ బి.సాయికృష్ణ, సంయుక్త కార్యదర్శిగా చిలకా శ్రీనివాసరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా మరో 25మంది ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ తాతాసేవకుమార్ 2004లో ఐఎంఏ గుంటూరు శాఖలో సభ్యత్వం పొందారు. శాఖలో అంచలంచెలుగా పలు పదవులు నిర్వహించి ఇప్పుడు అధ్యక్ష పదవి అందుకున్నారు. ఐఎంఏ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న డాక్టర్ సేవకుమార్ గతంలోరాష్ట్ర వర్కింగ్ కమిటీలో, ఐఎంఏ వివిధ స్కీంలలో పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, జాతీయ కౌన్సిల్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందిన డాక్టర్ సేవ కుమార్ 1996లో బ్రాడీపేటలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ (ఎస్‌హెచ్‌ఓ)ను స్థాపించారు. నాటి నుంచి ఉచిత వైద్య సలహాలు, అతి తక్కువ ఖర్చుకి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు అందిస్తున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ సేవకుమార్‌ను ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిశోర్, పూర్వ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.కిశోర్, ఐఎంఏ సీజీపీ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ ఎం.ఫర్నికుమార్, ఎన్నికల నిర్వహణ అధికారి డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావు, డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, డాక్టర్ డి. అమరలింగేశ్వరరావు తదితరులు అభినందించారు.