
రైతుకు వి‘పత్తి’
● వర్షాల ధాటికి పంటను ఆశించిన
ఎర్ర తెగులు, గులాబీరంగు పురుగు
● పంట ఎదుగుదల లేకపోవడంతో
ఐదెకరాల్లో పంట పీకేసిన పత్తి రైతు
ప్రత్తిపాడు: ఆ రైతు.. ఆరుగాలం శ్రమించాడు. ఎండనక వాననక ఆశల సాగు చేశాడు. పుడమినే నమ్ముకుని చేను కౌలుకు తీసుకున్నాడు. అరువు చేసి అరక కట్టాడు. కాలం విసురుతున్న విపత్కర పరిస్థితులను దాటుకుంటూ కౌలు భూమిలో పత్తి విత్తనాలను విత్తాడు. కానీ ప్రకృతి మాత్రం వాన రూపంలో వదలకుండా వెంటాడింది. చివరకు పంట తెగుళ్లబారిన పడి, ఎదుగుదల లేకపోవడంతో కన్నీటి పర్యంతమవుతూ సాగు చేసిన పంటను తన చేతులతోనే పీకేసుకోవలసిన వి‘పత్తి’ని ఆ వృద్ధ రైతు ఎదుర్కొన్నాడు.
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానికి చెందిన నూనె గణపతికి ఎకరం భూమి ఉంది. మూడు నెలల కిందట మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తం ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు పంట పెరుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. పై ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు కూడా పొలంలో రోజుల తరబడి నిలబడటంతో ఉరకెత్తి ఎర్ర తెగులు సోకింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా గులాబీ రంగు పురుగు కూడా పంటను తీవ్రంగా ఆశించింది. దీంతో మొక్క ఎదుగుదల లోపించింది. మూడు నెలలైనా రెండడుగులు కూడా పెరగలేదు. కౌలుకు రూ. లక్ష, వ్యవసాయం చేసేందుకు సుమారు మరో రూ.లక్ష వరకు పెట్టుబడులు అయ్యాయి. గుండె తరుక్కుపోయిన గణపతి పొలంపై ఆశలు వదులుకున్నాడు. బుధవారం ఉదయం కన్నబిడ్డలా సాగు చేసిన పైరును తన చేతులతోనే పీకేశాడు.