
50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు వెస్ట్: ఖరీఫ్ సీజన్‌లో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా నిర్ణయించామని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ధాన్య సేకరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జిల్లాలో 3,89,849 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉందన్నారు. ఇందులో ఈ ఏడాది డిసెంబర్ నుంచి 50 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 177 రైతు సేవ కేంద్రాలు, 45 రైతు సేవ క్లస్టర్ల ద్వారా ధాన్యం సేకరిస్తామని పేర్కొన్నారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 చొప్పున ఇచ్చి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ అధికారులు ఇ–పంట, ఇ – కేవైసీ వంద శాతం పూర్తి చేయాలన్నారు. పంట రకాన్ని గుర్తించాలని, తేమ శాతం అధికంగా లేకుండా చూడాలని చెప్పారు. ధాన్యం సేకరణ నిబంధనలను రైతులకు తెలియజేయాలన్నారు. రైతుల ఎంపిక మేరకు పంటను సంబంధిత మిల్లులకు తరలించేలా సివిల్ సప్లయిస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ ఉండేలా రవాణా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తేమ శాతం అధికంగా ఉంటే డ్రయర్లను ఉపయోగించుకోవాలన్నారు. రైతులకు అవసరమైన టార్పాలిన్‌లు సరఫరా చేసేందుకు మార్కెటింగ్ శాఖాధికారులు, ధాన్యం తూకానికి సంబంధించి లీగల్ మెట్రాలజీ అధికారులు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్‌కు సరిపడా హమాలీలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మిల్లర్లు మాట్లాడుతూ.. టార్పాలిన్‌లను సబ్సిడీపై అందించాలని కోరారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని విన్నవించారు. ఈ విషయాలను ప్రభుత్వానికి తెలియజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లయిస్ జీఎం పి.జయంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.