
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం
వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట పీహెచ్‌సీ వైద్యుల నిరసన
నరసరావుపేట టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు మంగళవారం పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పీహెచ్‌సీ వైద్యులు ఓపీ సేవలు బహిష్కరించి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ మమత ప్రియ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు నిలిపివేశామని, అత్యవసర చికిత్సలకు సేవలందిస్తున్నామన్నారు. సుమారు 25 సంవత్సరాల నుంచి పదోన్నతులు లేక ఒకే హోదాలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు న్యాయం చేయాలన్నారు. ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనం గిరిజన భత్యంగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేలు భత్యం ఇవ్వాలన్నారు. బుధవారం పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడతామన్నారు. గురువారం విజయవాడ వైద్య శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టటం జరుగుతుందన్నారు. అప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యులు రమ్య, జగన్ నరసింహారెడ్డి, రాధా కృష్ణణ్, ప్రదీప్, బాల అంకమ్మ పాల్గొన్నారు.