
సాగర్‌బాబు ఘటనపై తగిన న్యాయం చేస్తాం
నరసరావుపేట రూరల్: విద్యుత్ షాక్‌కు గురై వికలాంగుడిగా మారిన సాగర్‌బాబు ఘటనలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. జొన్నలగడ్డలోని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కార్యాలయం వద్ద సాగర్‌బాబు కుటుంబం గత రెండురోజులుగా నిరాహార దీక్షలు చేపట్టారు. మంగళవారం చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఎస్‌ఈ సందర్శించి, సాగర్‌బాబు భార్య కెజియాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు ఎస్‌ఈని కలిసి చర్చించారు. సాగర్‌బాబు కుటుంబం గత 17 రోజులుగా రిలే నిరాహారదీక్షలు, రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. వారి ఆరోగ్యం క్షీణిస్తుందని వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ ఘటనలో విద్యుత్ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని గ్రామ పెద్దలు రాతపూర్వకంగా ఇచ్చారని ఎస్‌ఈ తెలపగా.. రెండున్నర సంవత్సరాల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు నకిలీ లెటరు తీసుకువచ్చి చూపడం సరికాదని, ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. సాగర్‌బాబుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై శాఖాపరంగా విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్‌ఈ హామీ ఇచ్చారు. దీంతో సాగర్‌బాబు కుటుంబసభ్యులు రిలే నిరాహార దీక్షలను విరమించారు. కార్యక్రమంలో పీడీఎం నాయకులు వై.వెంకటేశ్వర్లు, నల్లపాటి రామారావు, జిల్లా అద్యక్షుడు షేక్ మస్తాన్‌వలి, కార్యదర్శి జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.