
ప్రభుత్వ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలి
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి సోమవారం సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలు, ధరలు తగ్గుదలపై గ్రామీణ, పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి జిల్లా కార్యాలయంలో జీఎస్టీ 2.0పై అవగాహన కోసం హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా సురక్షితమైన తాగునీరు సరఫరా చేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతిరోజు నీటి శాంపిల్స్ తీయాలని, క్లోరినేషన్ తరువాత మాత్రమే నీటిని సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో దోమలు నియంత్రణకు డ్రెయిన్లలో ఆయిల్ బాల్స్, ఫాగింగ్‌కు కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. తల్లికి వందనం నగదు జమ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఆటో మిత్రలో ఆమోదం పొందిన దరఖాస్తుల ఈకేవైసీ నూరుశాతం తక్షణమే పూర్తి చేయాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న వివిధ సర్వేలు నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేలా ఎంపీడీవో, కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే ఖాజావలి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు.
కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా