
ప్రజలకు తగ్గనున్న వైద్య ఖర్చులు
గుంటూరు మెడికల్: అత్యవసర మందులు, వైద్య పరికరాలపై ప్రభుత్వం జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గించడం వల్ల ప్రజలకు ఖర్చులు తగ్గుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా శిశువులకు ఉపయోగించే న్యాప్కిన్లు, ఫీడింగ్ బాటిల్స్, వ్యక్తిగత ఆరోగ్య బీమా అంశాలపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపును ఇచ్చారని పేర్కొన్నారు. క్యాన్సర్ కారకమైన పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 28 నుంచి 40 శాతానికి పెంచడం వల్ల వినియోగం తగ్గుతుందన్నారు. తద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని తెలిపారు. వైద్యశాఖ అధికారులు, వైద్యులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు, క్యాలెండరు యాక్టివిటీస్‌లో భాగంగా అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా న్యాయ విజ్ఞాన సంస్థలో సదస్సు నిర్వహించారు. ఇన్‌చార్జి కార్యదర్శి ఎం.కుముదిని సదస్సును ప్రారంభించారు. వృద్ధులకు న్యాయపరంగా ఉన్న సెక్షన్లు, హక్కులు, పిల్లల ద్వారా మోసపోయిన వారికి తిరిగి ఆస్తిని పొందే చట్టాల గురించి ఆమె వివరించారు. వృద్ధులు ఎదుర్కొనే పలు సమస్యలు, వాటి పరిష్కారాల గురించి స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసి యేషన్ సెక్రటరీ ఉమామహేశ్వరరావు తెలియజేశారు. కార్యక్రమంలో సీహెచ్.పరమేశ్వరరావు, పారా లీగల్ వలంటీర్స్, వృద్ధులు పాల్గొన్నారు.
లక్ష్మీపురం: కౌలు రైతుల సమస్యలపై అక్టోబర్ 13, 14 తేదీల్లో మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు చెప్పారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులందరికీ భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని కోరారు. ఈ క్రాప్ నమోదు చేసి ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర నష్ట పరిహారాలు వర్తింప చేయాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు లక్ష మంది కౌలు రైతులున్నారని, 70 శాతం వారే సాగు చేస్తున్నారన్నారు. రైతు సేవా కేంద్రాల్లో అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు, సాంబిరెడ్డి, కృష్ణ, అమ్మిరెడ్డి, నీలాంబరం పాల్గొన్నారు.