
లంక గ్రామాల్లో మంత్రి పర్యటన
కొల్లిపర: కృష్ణా నదికి వరద పెరిగినందున నది పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి విపత్తు సంఘటనలు జరగకుండా అధికారులు తగుజాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మండలంలోని బొమ్మువానిపాలెం గ్రామంలో ఆదివారం మంత్రి పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఉహించిన విధంగా నదిలో వరద ఉధృతి పెరిగితే లంక గ్రామాల ప్రజలను, పాడి పశువులను పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి తగ్గేవరకు లంక గ్రామంలో వైద్య అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, పారిశుద్ధ్యంపై పంచాయతీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎటువంటి అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ గోపాలకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, ఈవోపీఆర్డీ భార్గవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.