
విశ్వ నరుడు గుర్రం జాషువా
పట్నంబజారు: సమాజ శ్రేయస్సు కోసం రచనలు చేసి.. మూఢ నమ్మకాలు, దురాచారాలపై పోరాడిన విశ్వ నరుడు, మహాకవి, కవి కోకిల గుర్రం జాషువా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం గుర్రం జాషువా 130వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆధునిక తెలుగు కవుల్లో ఉన్నత స్థానం పొందిన గొప్ప వ్యక్తి జాషువా అని చెప్పారు. ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా వాసి కావటం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. తన రచనలతో సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారన్నారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ జాషువా రచనలు సమాజ శ్రేయస్సుకు ఎంతో దోహదపడ్డాయన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని కోరారు. వైఎస్సార్ సీపీ నేతల నిమ్మకాయల రాజానారాయణ, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బైరెడ్డి రవీంద్రారెడ్డి, బందా రవీంద్రనాథ్, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, దానం వినోద్, బత్తుల దేవా, అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.