
బ్యాంకు ఉద్యోగుల ‘స్వచ్ఛతా హీ సేవ’
కొరిటెపాడు: స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఈ నెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు పలు శుభ్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బ్యాంకు చైర్మన్ కె.ప్రమోద్‌కుమార్ రెడ్డి తెలిపారు. గుంటూరు శ్యామలానగర్ పార్కులో శుక్రవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం, ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. వారికి విధుల్లో ఉపయోగపడేలా ప్రత్యేకమైన కిట్లను అందజేశారు. చైర్మన్ మాట్లాడుతూ వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, సమాజ అభివృద్ధికి పరిశుభ్రత అత్యంత అవసరమని పేర్కొన్నారు. పరిశుభ్రతకు కార్మికులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి కృషి ప్రశంసనీయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.