
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఇప్పటం – వడ్డేశ్వరం మధ్య బకింగ్‌హామ్ కెనాల్ ఒడ్డున డ్రైనేజీ కాలువలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడిని తాడేపల్లి పట్టణ పరిధిలోని సలాం హోటల్ సెంటర్‌కు చెందిన కొర్రపాటి సాల్మన్ రాజు(66)గా గుర్తించారు. సాల్మన్ రాజు భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఖాజావలి శుక్రవారం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఆరుగురితో కలసి చేపల వేటకని ఇప్పటం – వడ్డేశ్వరం మధ్య బకింగ్‌హామ్ కెనాల్‌కు సాల్మన్ రాజు వెళ్లాడు. మార్గమధ్యలో ఏడుగురూ భోజనం చేశారు. తర్వాత ఆరుగురు చేపల వేటకు వెళ్లారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాల్మన్ రాజు తమ వెంట రాలేదని మిగిలిన వారు తెలిపారు. డ్రైనేజీలో పడితేనే తన భర్త ఎలా చనిపోతాడని భార్య అనుమానం వ్యక్తం చేశారు.
అక్టోబర్ 27న జిల్లా పెన్షనర్ల సంఘం సర్వసభ్య సమావేశం
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం పల్నాడు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం అక్టోబర్ 27వ తేదీన నిర్వహిస్తున్నట్టు సంఘం జిల్లా అధ్యక్షుడు మానం సుబ్బారావు, కార్యదర్శి సి.సి.ఆదెయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశానికి సంఘంలో సభ్యత్వం గల ప్రతి ఒక్క పెన్షనర్ హాజరై విజయవంతం చేయాలని కోరారు. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన సంఘ సభ్యులు సమావేశానికి హాజరై నూతన కార్యవర్గం ఎన్నికలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.