డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి
గుంటూరు మెడికల్: జిల్లాలో ప్రస్తుతం ప్రబలిన డయేరియా పరిస్థితి రీత్యా డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి జిల్లాలోని ఆర్‌ఎంపీ, పీఎంపీల సంఘనేతలతో బుధవారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్‌ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలన్నారు. ఓఆర్‌ఎస్ ద్రావణం పంపిణీ తప్ప తమ పరిధికి మించి చికిత్స చేయకూడదన్నారు. సైలెన్లు ఎక్కించడం, మందులు ఇవ్వడం వంటివి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు, డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, ఆరోగ్య విస్తరణ అధికారి నూనె రామకృష్ణ, సూపర్‌వైజర్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
3,202 గృహాలు సర్వే ..
అతిసార ప్రభావిత ప్రాంతాల్లో 50 బృందాలు 3202 గృహాలను సర్వే చేసిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం తెలిపారు. అతిసార నివారణకు తీసుకున్న చర్యలు వివరించారు. నోడల్ అధికారులుగా నియమితులైన జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించి తీసుకోవలసిన చర్యలు పై ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. జీజీహెచ్‌లో సెప్టెంబర్ 17 నుంచి ఇప్పటి వరకూ 185 కేసులు రిపోర్ట్ కాగా, 104 మంది బెడ్ మీద ఉన్నారని, 81 మంది డిశ్చార్జ్ అయ్యారని, కొత్తగా చేరిన వారిలో 8 కేసులు డిశ్చార్జ్ అయ్యారని, 23, 24 తేదీల్లో 17 కేసులు వచ్చాయని తెలిపారు. 168 నమూనాలు సేకరించగా 13 పాజిటివ్ వచ్చాయని, వాటిలో విబ్రియో 3, సిగేల్లి 1, ఇ – కోలి 9 కేసులు ఉన్నాయన్నారు.
ఆరు మండలాల్లో వర్షం
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 15.4 మిల్లీ మీటర్లు పడగా, అత్యల్పంగా పొన్నూరు మండలంలో 1.6 మి.మీ. పడింది.

ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి