
ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత
మాజీ ఎమ్మెల్సీ కేఎస్. లక్ష్మణరావు ఈనెల 25న రణభేరి సభ
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వం అమలు చేస్తున్న అకడమిక్ విధానాలపై ఉపాధ్యాయులు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ కేఎస్. లక్ష్మణరావు తెలిపారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 25న తలపెట్టిన రణభేరి సభ పోస్టర్లను ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈనెల 25న శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైనా డీఏ, ఐఆర్ ఇవ్వకపోవడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. వెంకటేశ్వర్లు, ఎం.కళాధర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రణభేరి జాతాకు అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారని వివరించారు. ఈనెల 25న తలపెట్టిన రణభేరి ముగింపు సభలో కూడా అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంఘ జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు ఎం.గోవిందు, జి.వెంకటేశ్వరరావు, ఎండీ షకీలా బేగం, కె.రంగారావు, ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.కోటిరెడ్డి, గఫార్, ఉదయ్ భాస్కర్, బురాన్, గోపయ్య పాల్గొన్నారు.