
జనాభాను తగ్గించి చూపడం దారుణం
గుంటూరు రూరల్: నగర శివారు గోరంట్లలోని ఉడ్‌లాండ్ హోటల్‌లో నూర్ బాషా, దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కె. పీర్ మహమ్మద్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలుగా ఉన్న జనాభాను ఒకటి రెండు లక్షలుగా చూపిస్తూ దూదేకులను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం గౌరవ అధ్యక్షుడు, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్‌మీరా మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తన వంతు సేవలందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం లైజనింగ్ కమిటీ, కోర్ కమిటీతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ ఉమర్ ముక్తార్‌ను నియమించారు. ముక్తర్ మాట్లాడుతూ తన తండ్రి చమన్ ఏర్పాటు చేసిన సంఘంలో పని చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువతను ఏకం చేసి సంఘం అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. సంఘం సలహాదారుడు డాక్టర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పర్ల దస్తగిరి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ డి. మస్తానమ్మ చేతుల మీదుగా లైజనింగ్ కమిటీ, కోర్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల అధ్యక్షులతో పాటు రాష్ట్ర నాయకులు సాయిబాబా, డీఎస్పీ మహబూబ్ బాషా, రిటైర్డ్ ఎమ్మార్వో షేక్ షావలి, లాల్ వజీర్, నాగూర్, ఆదాం షఫీ, దిల్షాద్, రజియా, ఖాజావలి, షేక్ మస్తాన్, షరీఫ్, ఇబ్రహీం, ఖాసిం, ఆరిఫ్, మహబూబ్ బాషా, ఇమాములు, బాషా పాల్గొన్నారు.
నూర్‌బాషా, దూదేకుల ముస్లిం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పీర్ మహమ్మద్