
ట్రెక్కింగ్‌తో మానసిక వికాసం, శారీరక ఆరోగ్యం
గుంటూరు ఎడ్యుకేషన్ :ఆరోగ్యవంతులైన యువతీ, యువకులతోపాటు శరీరం సహకరించే ప్రతి ఒక్కరూ ట్రెక్కింగ్‌ను ఒక అలవాటు, హాబీగా మలచుకోవాలని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్‌ఏఐ) గుంటూరు యూనిట్ చైర్మన్ డాక్టర్ కె.కొండయ్య పేర్కొన్నారు. ఆదివారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో వైహెచ్‌ఏఐ గుంటూరు యూనిట్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. గుంటూరు యూనిట్ అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్యక్షత జరిగిన సమావేశంలో డాక్టర్ కొండయ్య మాట్లాడుతూ ట్రెక్కింగ్ ద్వారా అద్భుతమైన శారీరక, మానసిక ఆరోగ్యంతోపాటు విశ్వజనీన మానవునిగా సంబంధాలు కలిగి ఉండవచ్చునని అన్నారు. కలుషిత వాతావరణంలో కృత్రిమంగా జీవించేందుకు అలవాటు పడిన వారు ట్రెక్కింగ్ ద్వారా మరో అద్భుతమైన ప్రపంచాన్ని, సుందర స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చని చెప్పారు. స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చటి ప్రకృతి సంపద, తమ శబ్దాలతో పలకరించే పక్షులు, జంతువులు చెప్పలేనంత మానసిక ఆనందాన్ని కలుగజేస్తాయని వివరించారు. కార్యక్రమంలో గుంటూరు యూనిట్ ఉపాధ్యక్షుడు జానకి, కేశవరావు, కార్యనిర్వాహక కార్యదర్శులు గుణరంజన్, భాను, సంయుక్త కార్యదర్శి శ్రీలత, సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్ మల్లికార్జునరావు, కోశాధికారి సుధాకర్, పీఆర్వో మేడూరి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.