
వైద్య, విద్యా రంగాలను సర్వనాశనం చేస్తున్న చంద్రబాబు
సత్తెనపల్లి: రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యారంగాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు మండిపడ్డారు. పల్నాడు జిల్లాతోపాటు గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పిడుగురాళ్ల మండలం కామేపల్లిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించేందుకు శుక్రవారం బయల్దేరారు. పోలీసులు ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు పెట్టి ఆంక్షలు విధిస్తూ అడ్డుకునే ప్రయత్నాలు చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చే విద్యార్థి, యువజన విభాగ నాయకులను సత్తెనపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న కార్లు, వాహనాలను ఆపేసి దింపేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లడానికి వీల్లేదు.. నిరసన తెలియజేయడానికి వీల్లేదంటూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగ నాయకులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఆయా విభాగాల నాయకులు సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లోని పేరేచర్ల–కొండమోడు జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీడియాతో మాట్లాడుతూ ‘‘మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము ఆందోళన చేస్తుంటే అడుగడుగునా ఆంక్షలు పెట్టి పోలీసులు అడ్డుకుంటున్నారు.. మేము పోలీసులను అడుగుతున్నాం.. అయ్యా మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు.. గంట సేపు రోడ్డుపై ట్రాఫిక్ ఆగినంత మాత్రాన ప్రజలు ఇబ్బందులు ఏమీ పడరు.. మెడికల్ కాలేజీలు ఆగిపోతే రాష్ట్రంలో ప్రజలతోపాటు, కొన్ని లక్షల మంది విద్యార్థులు నష్టపోతార’’ని తెలిపారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఐదు నెలల్లో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకు రావడం జరిగిందన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వానికి ఏం అడుగుతారంటే తమ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలని... మెడికల్ సీట్లు కావాలని కోరతారన్నారు. దుర్మార్గం ఏందంటే మన రాష్ట్రంలో మాత్రం మెడికల్ సీట్లు వద్దు.. మెడికల్ కాలేజీలు వద్దంటూ డైరెక్ట్‌గా ఎన్‌ఎంసీకి లెటర్ రాసిన వ్యక్తి దుర్మార్గుడు సీఎం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ యువజన్ విభాగం గుంటూరు, కృష్ణా జిల్లాల కోఆర్డినేటర్ కళ్లం హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ నిరసన తెలియజేస్తే కదా విద్యార్థులు ఏం కోల్పోయారు.. పేదలు ఏం కోల్పోయారనేది తెలిసేదన్నారు. గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘అనుమతి లేదని అడ్డుకుంటున్నారు.. పిల్లల భవిష్యత్తు కోసం అడుగుతున్నామని, కనీసం కొంత మందికై నా అనుమతి ఇవ్వాలని అడిగినా పోలీసులు ఇవ్వడం లేద’’న్నారు. యువజన విభాగం గుంటూరు టౌన్ అధ్యక్షుడు వై.కోటేశ్వరరావు మాట్లాడుతూ అనుమతి లెటర్ పంపాం.. అయితే వారు అనుమతి ఇవ్వలేదన్నారు. నడుచుకుంటూ వెళతామంటే వదల్లేదని, విద్యార్థుల కోసం పోరాటం చేస్తుంటే అనుమతి లేదంటున్నారని తెలిపారు. శాంతియుతంగా చేస్తుంటే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రెసిడెంట్ షేక్ సుభాని మాట్లాడుతూ అణచివేత ప్రభుత్వమంటే తెలుగుదేశం పార్టీ అని విమర్శించారు. డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తే, సీట్లు వద్దు, పేదలకు ఉపయోగపడే పని చేయడం లేదని చెబుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మెడికల్ కాలేజ్‌లు ప్రైవేటుపరం చేయడమంటే ఒక వ్యక్తి ధనం ఆర్జించడమేనని తెలిపారు. ఎక్కడిక్కడ విద్యార్థులను ఆపి పోలీసులు సత్తెనపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో విద్యార్థి, యువజన విభాగం నాయకులు చిన్నాబత్తిని వినోద్‌కుమార్, బాజీ, కానూరి శశిధర్, పిడతల భానుప్రకాష్, పేటేటి నవీన్‌కుమార్, రవీంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య
దోచుకునేందుకే ప్రభుత్వ మెడికల్
కళాశాలల ప్రైవేటీకరణ
వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన
నాయకులను అడ్డుకున్న పోలీసులు
పేరేచర్ల–కొండమోడు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన