
రెక్కల కష్టం.. వర్షార్పణం
అన్నదాత ఆక్రందన
ఖరీఫ్‌లో మూడుసార్లు మునిగిన పొలాలు
శలపాడులో దెబ్బతిన్న పంట పొలాలు
సాయం కోసం ఎదురుచూపు
కోలుకోలేని విధంగా నష్టం
చేబ్రోలు: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో అన్నదాతలు ఆటుపోటులను ఎదుర్కొన్నారు. అతివృష్టితో అవస్థలు పడ్డారు. వర్షం నీటితో పొలాలన్నీ మునిగిపోయాయి. రైతుల కష్టం వర్షార్పణం మైంది.
చేబ్రోలు మండలంలోని శలపాడు, వీరనాయకునిపాలెం గ్రామాల పరిధిలో రైతుల అవస్థలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. వందలాది ఎకరాల వరిపొలాలు వరద ముంపు బారిన పడ్డాయి. శుక్రవారం నాటికి కూడా ముంపు నుంచి బయటపడకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోవలసి రావటంతో ఆందోళన చెందుతున్నారు.
కన్నెత్తి చూడని నేతలు, అధికారులు
కష్టంలో ఆదుకోవాల్సిన అధికారులు, నాయకులు కన్నెత్తి కూడా చూడకపోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రెండు నెలల్లో ఇప్పటి వరకు మూడు సార్లు వరి పొలాలు ముంపు బారిన పడ్డాయి. వరద తాకిడికి వరి పొలాలు కుళ్లిపోయాయి.
శాపంగా మారిన తుంగభద్ర డ్రెయిన్
చేబ్రోలు మండల పరిధిలోని శలపాడు, వీరనాయకునిపాలెం గ్రామాల మధ్యలో ఉన్న తుంగభద్ర డ్రైయిన్ రైతులకు శాపంగా మారింది. మంగళగిరి, గుంటూరు తదితర ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తాకిడికి పొంగి సమీప పొలాలను ముంచెత్తుతోంది. రెండు గ్రామాల పరిధిలో నాలుగు వందల ఎకరాలు నేటికీ ముంపు బారిలోనే ఉన్నాయి. కొద్దిపాటి వర్షానికి సైతం ఎగువ ప్రాంతాల నుంచి డ్రెయిన్‌కు బారీగా వర్షపు నీరు చేరుతోంది. గత నెలలో కురిసిన భారీ వర్షానికి పదిహేను రోజులు పొలాలు నీట మునిగిపోవటంతో ఏపుగా ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. శ్రమకోర్చి కుళ్లిపోయిన వరి పొలాలను దమ్ము చేసి, అధిక రేటుకు నారు కొనుగోలు చేసి మళ్లీ నాట్లు వేశారు. మరికొంతమంది రెండో సారి వెద పద్ధతిలో గింజలు నాటారు. కొద్ది రోజుల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నాలుగు రోజులుగా వరి పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఏపుగా ఉన్న పొలాలు కుళ్లి పోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతాంగం కోరుతున్నారు.
కన్నెత్తి చూడని వ్యవసాయశాఖాధికారులు
శలపాడు, వీరనాయకునిపాలెం తదితర గ్రామాల్లో వరి పొలాలు ముంపు బారిన పడి రైతులు ఆందోళన చెందుతుంటే, అండగా ఉండాల్సిన వ్యవసాయశాఖాధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. మునిగిన పొలాల రక్షణకు సూచనలు, సలహాలు కూడా లేవు. నేటి వరకు తమ పొలాలను పరిశీలించ లేదని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంట నష్టపరిహారం అందించాలి
వందలాది ఎకరాలు రెండు నెలల కాలంలో మూడు సార్లు దెబ్బతినటంతో ఎకరానికి రూ.30వేల వరకు రైతులు నష్టపోయారు. ఉన్నతాధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను అంచనా వేసి, ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించాలని లేనిపక్షంలో అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెక్కల కష్టం.. వర్షార్పణం