
అక్రమ అరెస్ట్‌లతో అడ్డుకోలేరు !
పట్నంబజారు: అక్రమ అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలతో ప్రజల పక్షాన చేసే పోరాటాలను కూటమి ప్రభుత్వం అడ్డుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పిడుగురాళ్లలో జరిగిన ‘చలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమానికి పార్టీ యువజన, విద్యార్థి విభాగం నేతలు తరలి వెళ్లారు. బృందావన్ గార్డెన్స్‌లోని జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా జెండా ఊపి ప్రారంభించారు.
అంబటి నివాసం వద్ద భారీగా పోలీసులు
ముందుగా అంబటి నివాసం వద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ర్యాలీలకు అనుమతి లేదని, ఇందుకు సంబంధించి నోటీసులు తీసుకోవాలని పోలీసులు అడ్డుకున్నారు. అయితే, తాము ఎటువంటి ర్యాలీలు, నిరసన కార్యక్రమాలకు వెళ్లడం లేదని, తమ జిల్లా పార్టీ కార్యాలయం వద్దకు వెళ్తున్నామని రాంబాబు పోలీసులకు వివరించారు. జిల్లా పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి నోటీసులు ఇస్తే తీసుకుంటామని చెప్పడంతో పోలీసులు అక్కడకు వచ్చి జారీ చేశారు.
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వైద్య విద్య
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో నిర్మాణం చేసిన మెడికల్ కళాశాలలను కూటమి సర్కార్, చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు అందాల్సిన వైద్యాన్ని, విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే కుట్రలకు తెరదీశారని ధ్వజమెత్తారు. మెడికల్ కళాశాలల నిర్మాణాలకు రూ. 5వేల కోట్లు లేవని చెబుతున్నారని, రూ. 52వేల కోట్లు అప్పు ఎక్కడ నుంచి తెచ్చారన్నారు. అమరావతికి అయితే ఎంతైనా నిధులు వస్తాయా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు జ్ఞానం తెచ్చుకుని ఇప్పటికై నా ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని హితవు పలికారు. పెట్టుబడి పెట్టిన వాడు వ్యాపారం చేస్తాడు తప్పా.. ఉచిత సేవ చేయడన్న విషయం తెలియదా ? అని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం దక్కుతుందో లేదో అందరికీ తెలుసన్నారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని
కూటమి పాలన
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నాళ్లు పాలన చేస్తారని మండిపడ్డారు. నానాటీకీ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటూనే ఉన్నారని, ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్ట్‌లతో భయపెట్టాలని చూడటం సిగ్గుచేటని ఖండించారు. కేసులెన్ని పెట్టినా, బెదిరింపులకు గురి చేసినా వైఎస్సార్ సీపీ అడుగు కూడా వెనక్కి వేయదని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం నేత కళ్లం హరికృష్ణారెడ్డి, నగర యువజన విభాగం అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు యాదవ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు శశిధర్, తూర్పు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు సుభాని, అనిల్‌రెడ్డి, విద్యార్థి విభాగం నేతలు భానుప్రకాష్, యువజన, విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు.
అంబటి ఇంటి వద్ద పోలీస్ బలగాలు
నగరంపాలెం: పోలీసులతో ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని ప్రయత్నం చేసే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. గుంటూరు సిద్ధార్థనగర్‌లోని ఆయన నివాసం వద్దకు శుక్రవారం మధ్యాహ్నం పట్టాభిపురం పోలీసులు, బలగాలు భారీగా చేరుకున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్దకు వెళ్లేందుకు బయలుదేరిన అంబటి రాంబాబు, పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. ముగ్గురు ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది ఇంటి వద్దనే సాయంత్రం వరకు పహారా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సత్తెనపల్లి పోలీసులు అనేక మందిని నిర్బంధించారని, 12 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని చేయాలని భావించామని చెప్పారు. అయితే, గుంటూరులో తనను, చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజనీని, పల్నాడు జిల్లాలో యువజన విభాగం నేత శ్రీకాంత్‌ను అడ్డుకున్నారని వివరించారు. పోలీసుల ద్వారా ఉద్యమాలను అణిచివేయాలని చూడడం దురదృష్టకరమని ఖండించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించి డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, నాయకులు పఠాన్ సైదాఖాన్, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, నందేటి రాజేష్, న్యాయవాదులు రామకృష్ణారెడ్డి, క్రాంతికుమార్ పాల్గొన్నారు.

అక్రమ అరెస్ట్‌లతో అడ్డుకోలేరు !