
బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
మంగళగిరిటౌన్: మంగళగిరి పట్టణ పరిధిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి సన్నిధిలో ఈనెల 22వ తేదీ నుంచి జరగనున్న శ్రీదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల శుభ ఆహ్వానపత్రికను దేవస్థానంలో శుక్రవా రం ఆవిష్కరించారు. ఆలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
నకిలీ పత్రాలను పరిగణలోకి తీసుకోరాదు
గుంటూరు ఎడ్యుకేషన్: ఢిల్లీకి చెందిన విద్యాంజలి సంస్థ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ ఉపాధ్యాయ నియామక పత్రాలను పరిగణలోకి తీసుకోరాదని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం జరిపినట్లుగా ప్రచారం జరుగుతున్న ఫేక్ ధ్రువపత్రాలపై అప్రమత్తంగా ఉండాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, క్షేత్రస్థాయి విద్యాశాఖాధికారులకు సూచించారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌తో పాటు డీఈవోల నుంచి ఎటువంటి నియామక పత్రాలు జారీ అవ్వలేదని స్పష్టం చేశారు. డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయులుగా నియామకం పొందిన అభ్యర్థులకు ప్రభుత్వం త్వరలో అధికారికంగా తేదీని ప్రకటించి, నియామకపత్రాలు అందజేస్తుందని తెలిపారు. ఫేక్ నియామక పత్రాల ద్వారా నిరుద్యోగ అభ్యర్థులు మోసపోరాదని సూచించారు.
రాహుకేతు పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు
పెదకాకాని: శివాలయంలో రాహుకేతు గ్రహ పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ జీవీడీఎల్ లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 21వ తేదీన మహాలయ అమావాస్య ఆదివారం కావడంతో ఈ పూజలు చేయించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని శుక్రవారం ఆయన పేర్కొన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని రాహుకేతు పూజా మండపం వద్ద షామియానాలు, క్యూలైన్‌లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ జరిగే ఈ పూజలకు ఆలయ ప్రధాన కౌంటర్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
గుంటూరు చానల్‌లో గల్లంతైన వ్యక్తి మృతి
కాజ(మంగళగిరి): గుంటూరు చానల్‌లో ప్రమాదవశాత్తూ పడి గల్లంతైన వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి దొడ్డక రాంబాబు(42) చానల్‌లో పడిన సంగతి తెలిసిందే. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం మృతదేహాన్ని వెలికితీసి, ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. రాంబాబు భార్య ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఉచిత ప్రసాద వితరణ పథకానికి శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గొట్టుముక్కల నాగమణి కుటుంబం రూ. 1,00116 విరాళం అందించింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ