
సమస్యలపై చర్చించే తీరిక ప్రభుత్వానికి లేదా ?
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించే తీరిక కూటమి ప్రభుత్వానికి లేకుండా పోయిందని యూటీఎఫ్ రాష్ట అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు విమర్శించారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద విద్యారంగ, ఉపాధ్యాయ అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ తలపెట్టిన రణభేరి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయుల బైక్ ర్యాలీకి జెండా ఊపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2023 జూలై నుంచి వర్తింప చేయాల్సిన 12వ పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎటూ తేల్చలేదని, నాలుగు విడతలుగా డీఏ బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. సంబంధిత ఆర్థిక అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఒక్కరోజు సైతం చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై నిందలు మోపుతూ వారిని ఒత్తిడి గురి చేసే విధానాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించకపోవడంతో పాటు నాలుగు విడతల డీఏ బకాయిలపై వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏ.ఎన్. కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్ మాట్లాడుతూ సెల్‌ఫోన్‌కు తావులేని పాఠశాల కావాలని, ప్రభుత్వ పాఠశాలను రక్షించుకుని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. రాజశేఖర్‌రావు, ఎం. కళాధర్ మాట్లాడుతూ ఈనెల 25న జరిగే రణభేరి రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
యూటీఎఫ్ రాష్ట అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు