
వైద్య విద్య ప్రైవేటీకరణ ఆపాలి
లక్ష్మీపురం: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయాన విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ రఘువీర్ డిమాండ్ చేశారు. జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్ సెంటర్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రఘువీర్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను లోకేష్ అమలుపరచకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. సూపర్ హిట్ సుపరిపాలన అంటూ సంబరాలు చేసుకుంటున్నారు గానీ విద్యార్థుల కష్టాలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న రూ.6400 కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన రూ.600 కోట్లు కేవలం పేపర్ ప్రకటనకే పరిమితమయ్యాయే తప్పా ఒక్క విద్యార్థి ఖాతాలో జమ కాలేదని తెలిపారు. వైద్య విద్య ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. పీపీపీ విధానంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షలాగా అవుతుందని పేర్కొన్నారు. బీసీ ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్, నగర కార్యదర్శి ప్రణీత్, నగర నాయకులు అజయ్, సాయి గణేష్, రాహుల్, వెంకట్, కుమార్, అజయ్ పాల్గొన్నారు.