
పొగాకు కేంద్రంలో రైతులకు తప్పని కష్టాలు
సాంకేతిక సమస్యతో రెండురోజులుగా ఎదురుచూపులు మీడియాతో మొరపెట్టుకున్నాక, సాయంత్రానికి సమస్య పరిష్కారం
తెనాలి: తెనాలిలోని పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులకు కష్టాలు కొనసాగుతున్నాయి. తీసుకొచ్చిన పొగాకును కొనకుండా తిరస్కరించారని కొద్దిరోజుల కిందట రైతులు ఆవేదనతో ఇంటిదారి పట్టిన ఘటన మరువక ముందే యాప్‌లో సాంకేతిక సమస్యతో సంబంధిత రైతులు రెండురోజులుగా పడిగాపులు కాయాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రంలోని రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవటంతో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే. మార్క్‌ఫెడ్ బయ్యర్లను ఏర్పాటుచేసి పొగాకు కొనుగోళ్లను చేయిస్తోంది. ఈ క్రమంలో పొగాకు పండే ప్రాంతాల్లో గౌడౌన్లు ఖాళీ లేకపోవటంతో తెనాలిలోని రాష్ట్ర ప్రభుత్వ వేర్‌హౌసింగ్ గిడ్డంగిలో ఈనెల ఒకటో తేదీ నుండి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆరంభించింది. పొగాకు పండించే గ్రామాల్లోని రైతు సేవాకేంద్రాల్లో పొగాకు రైతులకు షెడ్యూలు ఇచ్చి, విడతలవారీగా ఏయే కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు పొగాకు తీసుకెళ్లాలనేది మెస్‌జ్‌లను పంపుతున్నారు. పొగాకు నాణ్యత ప్రకారం కొనుగోలు చేస్తున్నారు.
నాణ్యత లేదని తిరస్కరణ
నాణ్యత లేదనే కారణంగా కారంచేడు, చీరాల ప్రాంతానికి చెందిన పలువురి రైతుల పొగాకు బేళ్లను బయ్యర్లు ఇటీవల తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అధికారుల సమాచారం ప్రకారం కారంచేడు మండలం జరుబులవారిపాలెం, కొడవలివారిపాలెం గ్రామాల నుంచి పొగాకును తీసుకుని వచ్చిన మైనేని సంజీవరావు, కంచర్ల రెబెక్కాలకు ఇక్కడ చుక్కెదురైంది. మార్క్‌ఫెడ్ యాప్‌లో లాగిన్ కావటం లేదంటూ కొనుగోలు చేయలేదు. వీరి సరుకును కనీసం వాహనంలోంచి దించుకోవాటినికి కూడా అనుమతించలేదు. దీనితో రెండురోజులుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని శుక్రవారం మీడియాతో మొరబెట్టుకున్నారు.
సాంకేతిక సమస్య
మార్క్‌ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలో సాంకేతిక సమస్య కారణంగా ఈ అవాంఛనీయ పరిస్థితి తలెత్తిందని, సమాచారం ఇచ్చామని అధికారులు రైతులకు నచ్చజెబుతూ వస్తున్నారు. వీరితోపాటు వచ్చిన మరో రైతు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తమ గ్రామంనుండి వంద కిలోమీటర్ల దూరంలోని తెనాలికి తీసుకువచ్చిన తమకు రూ.10 వేలకు పైగా రవాణా ఛార్జీలు అయినట్టు చెబుతున్నారు. ఇంత దూరంలో కొనుగోలు కేంద్రం కేటాయించటం, ఇక్కడా సరుకు అమ్మకానికి అవకాశం లేకుండా ఇబ్బంది పెట్టటం భావ్యమైనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రానికి వీరి ఆవేదనకు తెరపడింది. మార్క్‌ఫెడ్ కార్యాలయం అధికారులు సాంకేతిక సమస్యను తొలగించారు. రైతుల పేర్లు లాగిన్ కావటంతో వారి పొగాకును కొనుగోలు చేశారు. దీనితో ఆయా రైతులు, మీడియాకు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.