డాక్టర్‌ అని బోర్డు పెట్టుకుంటే చర్యలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ అని బోర్డు పెట్టుకుంటే చర్యలు తప్పవు

Sep 13 2025 5:58 AM | Updated on Sep 13 2025 5:58 AM

డాక్టర్‌ అని బోర్డు పెట్టుకుంటే చర్యలు తప్పవు

డాక్టర్‌ అని బోర్డు పెట్టుకుంటే చర్యలు తప్పవు

ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్సకి

మించి వైద్యం చేయరాదు

ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌

డాక్టర్‌ డి శ్రీహరిరావు హెచ్చరిక

గుంటూరురూరల్‌: నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా ఆర్‌ఎంపీలు, పీఎంపీలు డాక్టర్‌ అని బోర్డు పెట్టిన అత్యవసర ప్రథమ చికిత్స తప్ప ఏవిధమైన వైద్యం చేసినా చట్టబద్ధ చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ డి.శ్రీహరిరావు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ విజయలక్ష్మి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ గార్లపాటి నందకిషోర్‌ తో కలసి తురకపాలెం గ్రామాన్ని సందర్శించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, వైద్యుల్ని అడిగి నమోదవుతున్న కేసుల వివరాలు, అందిస్తున్న చికిత్సల గురించి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, స్థానిక వైద్యాధికారులు వివరించారు. అనంతరం గ్రామంలో పలు వీధులను పరిశీలించిన ఆయన ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ విజిలెనన్స్‌ అధికారి డాక్టర్‌ ఆశాకిరణ్‌తో కలిసి ఆర్‌ఎంపీలు పీఎంపీల ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. పేరు ముందు డాక్టర్‌ అని పేరు పెట్టుకున్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు. వారు రోగులకు ఇస్తున్న మందులను పరిశీలించారు. ప్రథమ చికిత్స కేంద్రాలలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సిన స్టెరాయిడ్స్‌, యాంటీబయాటిక్స్‌లను గుర్తించామన్నారు. తురకపాలెంలో చనిపోయిన వారిలో చాలామంది ఈ ప్రథమ చికిత్స కేంద్రాలలో సైలెన్లు, యాంటీబయాటిక్స్‌ విచక్షణ రహితంగా వాడడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందరికీ అందుబాటులో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క్వాలిఫైడ్‌ వైద్యులు ఇతర పారామెడికల్‌ సిబ్బంది ఉండగా ప్రజలు నకిలీ వైద్యుల నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాలకు వెళ్లడం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. దీనివల్ల చిన్నచిన్న వ్యాధులే ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉందన్నారు. ప్రజలందరూ ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయక ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ గార్లపాటి నందకిషోర్‌ మాట్లాడుతూ తురకపాలెం గ్రామ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తొలిదశలోనే క్వాలిఫైడ్‌ వైద్యుల్ని సంప్రదిస్తే ఎలాంటి సమస్యలు రావన్నారు. ఐఎంఏ వైద్యులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌తో పాటు తురకపాలెం సందర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ పూర్వ ఉపాధ్యక్షులు, ఐఎంఏ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డాక్టర్‌ నాగేళ్ల కిషోర్‌, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ టి.సేవాకుమార్‌, ఐఎంఏ గుంటూరు బ్రాంచ్‌ అధ్యక్షులు డాక్టర్‌ వై సుబ్బారాయుడు, ఉపాధ్యక్షులు డాక్టర్‌ డి అమరలింగేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్‌ బి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement