
అన్నదాతకు అండగా పోరు బాట
కూటమి సర్కార్ కళ్లు తెరిపించేలా వైఎస్సార్‌సీపీ సన్నాహాలు
దళారులు, టీడీపీ నేతల చేతుల్లోకి ఎరువులు
యూరియా కోసం రైతులు కొట్టుకోవాల్సిన దుస్థితి అన్నదాతల పక్షాన కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ పోరు 9న జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
ఆరుగాలం శ్రమించే రైతులకు కూటమి పాలనలో అడుగడుగునా ఘోష తప్పడం లేదు. సాగునీరు మొదలు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరల వరకు కన్నీరే మిగులుతోంది. పాలకుల నిర్లక్ష్యంతో కష్టాల్లో కూరుకుపోతున్నారు. అన్నదాతల తరఫున కూటమి సర్కార్ వైఫల్యాలను నిలదీయడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఈ నెల 9వ తేదీన ‘అన్నదాత పోరు’ చేపట్టనుంది. జిల్లాల్లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు, వినతిపత్రాల సమర్పణతో కూటమి పాలకుల కళ్లు తెరిపించి రైతులను ఆదుకునేలా పోరుబాట పట్టనుంది. ఈ మేరకు నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు, పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు శనివారం జరిగాయి.
నగరంపాలెం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన, అనంతరం వినతిపత్రాల సమర్పణ కార్యక్రమం ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సాయంత్రం నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి (మంగళగిరి), అన్నాబత్తుని శివకుమార్ (తెనాలి), వనమా బాల వజ్రబాబు (డైమండ్‌బాబు)(తాడికొండ), అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు ఉడుముల పిచ్చిరెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ సైదాఖాన్, గులాం రసూల్‌లతో కలిసి ‘అన్నదాత పోరు’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని గుంటూరు, తెనాలి ఆర్‌డీఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శన, వినతి పత్రాలు అందిస్తామని చెప్పారు. ఏపీలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని ఆరోపించారు. కొరతపై దుష్ప్రచారం చేసే వారిపై కేసులు బనాయిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించడం దుర్మార్గం అని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఎరువుల కొరత లేకపోతే విజయనగరం జిల్లాలోని ఓ ప్రైవేటు దుకాణం వద్ద లైనుల్లో ఉన్న రైతులు యూరియా కోసం ఎందుకు కొట్టుకున్నారని అంబటి గుర్తుచేశారు. రైతులు ఎరువుల కోసం అల్లాడిపోతున్న వైనంపై సోషల్ మీడియాతోపాటు చంద్రబాబు అనుకూలమైన ఎల్లో మీడియాలో రాస్తున్నారని గుర్తుచేశారు. వరుస లైన్లల్లో రైతులు ఉన్న ఫొటోలను ఓ పత్రిక లోపలి పేజీలో ఇచ్చిందని తెలిపారు.
దారుణంగా విఫలమైన ప్రభుత్వం
సకాలంలో రైతులకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. యూరియా ఇప్పటికే దళారులు, టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు. సుగాలి ప్రీతి కేసుని కూడా ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో జరిగిన మరణాలపై వైఎస్సార్‌సీపీ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వల్లే స్పందన వచ్చిందని అన్నారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రైతుల పక్షాన చేపట్టిన ‘అన్నదాత పోరు’లో రైతులు భారీగా పాల్గొనాలని అంబటి పిలుపునిచ్చారు.