
రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం
అన్నదాతలను పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తెనాలిలో 9న నిర్వహించనున్న ‘అన్నదాత పోరు’పై సమీక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలిరావాలని పిలుపు
పొన్నూరు: రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. యూరియా అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 9వ తేదీన తలపెట్టిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహణపై పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోస్టర్‌ను నాయకులతో కలిసి మురళీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొన్నూరు నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల కనీసం రైతులను పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదన్నారు. రైతు సంక్షేమాన్ని విస్మరించి సంగం డెయిరీ ఉత్పత్తులను విక్రయించుకునే పనిలో ఎమ్మెల్యే నిమగ్నమయ్యారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతులను వెన్నుపోటు పొడిచి యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ ఇబ్బంది పెడుతోందని అన్నారు. వెంటనే రైతులకు రూ. 10 వేలు నష్టపరిహారం, ఉచితంగా ఎరువులు, పురుగు మందులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెనాలి రండి
రైతు సమస్యల పరిష్కారం కోసం 9న తెనాలి ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి యందేటి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పొన్నూరు అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. సమావేశంలో ఎంపీపీ భవనం పద్మలీల, వైస్ ఎంపీపీ అంబటి రాఘవయ్య, వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆకుల వెంకటేశ్వరరావు, పొన్నూరు, పెదకాకాని మండల పార్టీ అధ్యక్షుడు చింతలపూడి మురళీకృష్ణ, మల్లికార్జునరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు మరియారాణి, నాయకులు లంకపోతు పిచ్చిరెడ్డి, షేక్ నాజర్, అంబటి వెంకటేశ్వరరావు, బోయిన నాగరాజు, గేరా సంజీవ్, దేవరకొండ గోపి, ఆర్. ఆదిశేషు, భీమవరపు విజయలక్ష్మి పాల్గొన్నారు.