
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మరణాలు
గ్రామంలో బెల్ట్ దుకాణాల ద్వారా ఏరులై పారుతున్న మద్యం అత్యంత అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ కలుషిత తాగునీటితో ప్రజలకు అనారోగ్య సమస్యలు బాధిత కుటుంబాలకు అండగా వైఎస్సార్‌సీపీ
గుంటూరు రూరల్: తురకపాలెం గ్రామంలో పలువురు కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని వైఎస్సార్‌సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్‌చార్జి బలసాని కిరణ్‌కుమార్ ఆరోపించారు. శనివారం గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతులకు నివాళులు అర్పించారు. ప్రతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకూ పోరాడదామని భరోసా కల్పించారు. ఈ సందర్బంగా బలసాని మాట్లాడుతూ... గ్రామంలో తాగునీరు ప్రజలకు అందటం లేదన్నారు. కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోందన్నారు. చిన్నపాటి గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నాలుగు బెల్ట్ షాపులు వెలిశాయని పేర్కొన్నారు. ఇంటి దగ్గరే మద్యం దొరుకుతుండటంతో అందరూ వాటికి అలవాటు అవుతారన్నారు.
మెరుగైన వైద్యసేవలు కీలకం
కలుషిత తాగునీరు, పారిశుద్ధ్యం లోపం, అక్రమ మద్యం విక్రయ దుకాణాలు వంటి వాటి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ అధికారులు దీనికి బాధ్యత వహించాలన్నారు. ప్రతి ఇంటిని మినరల్ వాటర్‌ను అందించాలన్నారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి వెంటనే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగిలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇంటూరి పద్మావతి అంజిరెడ్డి, మండల కన్వీనర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, పిల్లి మేరి, పెద్దిరెడ్డి సామ్రాజ్యం, మెట్టు వెంకటప్పారెడ్డి, దారం అశోక్‌కుమార్, వెంకటరావు, గ్రామంలోని ప్రజలు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.