
సీపీఎస్, జీపీఎస్ రద్దు బిల్లును పెట్టాలి
గుంటూరు వెస్ట్: ఈ నెల 11వ తేదీన జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్, జీపీఎస్ రద్దు బిల్లును ప్రవేశపెట్టాలని జిల్లా ఐక్యవేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ బాషా కోరారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమీపంలోని ఉద్యోగ సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఉద్యోగులకు మేలు చేయాలన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు కీలక భూమిక పోషిస్తారని గుర్తుచేశారు. వారి కనీస కోర్కెలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. సమావేశంలో ఉద్యోగ సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, పెదరత్తయ్య, శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు.