
కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం
పట్నంబజారు: కార్పొరేషన్ కమిషనర్, అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో దేవాపురంలోని పీకల వాగు కల్వర్టు పనుల జరుగుతున్న చోట గోరంట్లకు చెందిన తోట అప్పారావు అనే రోజువారీ కూలీ మృతి చెందటం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దేవాపురం పీకలవాగు వద్ద కల్వర్టు నాణ్యత లోపంతో కూలిపోయిన పరిస్థితుల్లో కార్మికుడు తోట అప్పారావు (58) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సంఘటన స్థలాన్ని అంబటి, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబుతో పాటు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పూర్తిగా సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పలుమార్లు కాంట్రాక్టర్‌కు ఒక పక్క కల్వర్టు వాలిపోతోందని తెలియజేసినా కిందట కర్రలు పెట్టి పనులు చేయించారని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ పీకల వాగుపై రూ. 9 లక్షల వ్యయంతో నిర్మాణం చేస్తున్న కల్వర్టు నాణ్యత లోపంతో కూలిపోయిందని ఆరోపించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ప్రపోజల్ పెట్టిన ప్లాన్‌ను కూటమి నేతలు, నగరపాలక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మౖక్కై మార్చే శారని ధ్వజమెత్తారు. కల్వర్టు స్లాబ్ నిర్మాణానికి ఇనుము కూడా తక్కువ వాడినట్లు తెలుస్తోందని స్పష్టం చేశారు. నగర కమిషనర్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు కాంట్రాక్టర్ వద్ద పర్సంటేజ్‌లు తీసుకుంటూ నాణ్యతను గాలికి వదిలేశారని ఆరోపించారు.
సాక్షిలో స్పష్టంగా రాశారు
నగరంలో అనేకచోట్ల నాణ్యత లేకుండా నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సాక్షి పత్రికలో ఘటన జరిగిన ముందు రోజే వార్త వచ్చిందని, దీన్ని ప్రతి ఒక్కరూ చదవాలని అంబటి రాంబాబు తెలిపారు. తక్షణమే కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని, కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన రోజువారీ కూలీ అప్పారావు కుటుంబానికి కాంట్రాక్టర్‌తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహాయం అందజేయాలని రాంబాబు కోరారు. స్థానిక కార్పొరేటర్ బూసి రాజలత మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, నందేటి రాజేష్, పఠాన్ సైదాఖాన్, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, దానం వినోద్, కార్పొరేటర్ గోపి శ్రీనివాస్, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, జిల్లా, నగర కమిటీ నేతలు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): కల్వర్ట్ కూలిన ఘటనలో ప్రాణాలు కొల్పోయిన తోట అప్పారావు కుటుంబానికి అండగా ఉంటామని మేయర్ కోవెలమూడి రవీంద్ర హామీ ఇచ్చారు. బుధవారం నగరపాలక సంస్థలోని మేయర్ చాంబర్‌లో కమిషనర్ పులి శ్రీనివాసులు, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కును కాంట్రాక్టర్ చేతుల మీదుగా అందించారు. మృతునికి ముగ్గురు ఆడపిల్లలున్నారని, వారు తమ జీవన భృతికి రైతు బజార్‌లో షాపు కావాలని అడుగుతున్నారని, మంజూరు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం