
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): నగరంలో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్. సతీ ష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షించేందుకు బుధవారం ఆయన ద్విచక్ర వాహనంపై కంకర గుంట అండర్ పాస్, బ్రాడీపేట, లక్ష్మీపురం, లాడ్జి సెంటర్, శంకర్‌విలాస్ సెంటర్, మూడు వంతెనలు, కొత్తపేట, నాజ్ సెంటర్, ఉమెన్స్ కళాశాల రోడ్డులో పర్యటించారు. ఎస్పీ మాట్లాడుతూ మూడు వంతెనలు, అండర్‌పాస్ వద్ద వర్షపు నీరు నిలవకుండా కార్పొరేషన్ కమిషనర్‌తో చర్చించి మోటార్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అమరావతి వైపు నుంచి వచ్చే హెవీ వాహనాలను లాడ్జి సెంటర్, లక్ష్మీపురం, కంకరగుంట బ్రిడ్జి మార్గంలో అనుమతించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని హెవీ వాహనాలు లాడ్జీ సెంటర్, శ్రీనగర్, మూడు వంతెనల మీదుగా డైవర్షన్ చేయాలని, మిగిలిన వాహనాలను శంకర్‌విలాస్ బ్రిడ్జి మీదుగా అనుమతించాలని తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బోర్డులు, చిత్ర పటాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజల కూడా పోలీసులకు ఆయన కోరారు. ఆయన వెంట ఈస్ట్ సబ్‌డివిజన్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్, వెస్ట్ డీఎస్పీ అరవింద్, ట్రాఫిక్ సీఐలు ఏ. అశోక్, సింగయ్య, అరండల్‌పేట సీఐ ఆరోగ్యరాజు, ట్రాఫిక్ ఎస్‌ఐలు పాల్గొన్నారు.
నగరంలో బైక్‌పై పర్యటిస్తున్న
ఎస్పీ సతీష్‌కుమార్