
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
లక్ష్మీపురం: భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏ.వి. నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాత గుంటూరులోని శ్రీకృష్ణ కల్యాణ మండపంలో బుధవారం భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ముందుగా యూనియన్ జెండాను సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణారావు, సీఐటీయూ జెండాను వి. ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 లోపు సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోతే ఎమ్మెల్యేలను ఎక్కడికి అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను చైతన్యంతో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పలు తీర్మాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి. నరసింహారావు మహాసభల నివేదికను ప్రతినిధుల ముందు చర్చకు పెట్టారు. కార్యక్రమంలో వర్కింగ్ ఉమెన్ రాష్ట్ర నాయకురాలు దయా రమాదేవి తదితరులు ప్రసంగించారు.