
సాయిరామ్ కాదు.. ‘సాయం’రామ్
గుంటూరు రూరల్: ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. అక్షర సత్యం వంటి ఈ మాటలకు అసలు సిసలు నిర్వచనం యేరువ సాయిరామ్ అని కితాబిచ్చారు. ఏటా పెద్దసంఖ్యలో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్న సాయిరామ్ పేరు ‘సాయం’రామ్‌గా సార్థకమవుతుందని ఎంపీ అభినందించారు. పెద పలకలూరులోని శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో యేరువ కోటిరెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన నిరుపేద మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏటా తరహాలోనే ఈ సంవత్సరం కూడా 50 విద్యా సంస్థల నుంచి అన్ని తరగతులకు చెందిన 1,525 మందికి రూ.50 లక్షల ఉపకార వేతనాలు అందించారు. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు పోలూరి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఎంపీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, స్కాలర్‌షిప్ ద్వారా చదువుకుని ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడిన సాయిరామ్ తన గతాన్ని మర్చిపోకుండా సమాజానికి తిరిగి తన చేతనైన సాయం చేస్తూ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆయన తన తండ్రి కోటిరెడ్డి పేరిట ఏటా రూ.లక్షలను ఉపకార వేతనాలు రూపంలో అందిస్తున్న ఔదార్యాన్ని ప్రశంసించారు. కోటిరెడ్డి భౌతికంగా లేకున్నా... సాయిరామ్ చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఎప్పటికీ సజీవంగానే ఉంటారని పేర్కొన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎంపీ పిలుపునిచ్చారు. పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉపకార వేతనాలతో నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఊతం లభిస్తుందన్నారు. ట్రస్ట్ సేవలు నిరుపమానమని ప్రశంసించారు. సాయిరామ్ తన తండ్రి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరు అభినందనీయం అన్నారు. ట్రస్ట్ స్థాపించడమే కాకుండా తన సొంత ఊరైన పెద పలకలూరులో జెడ్పీ హైస్కూలుకు సొంత స్థలాన్ని ఇచ్చి, భవనాన్ని సైతం నిర్మించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు యేరువ జగదీశ్వరి, యేరువ శ్రీవేణి, యేరువ రమణి, యేరువ అభిరాం, పాల సత్యకళ్యాణి, కావ్య, శ్వేత, శ్రీనివాసరెడ్డి, అభినందన్‌రెడ్డి, శ్రీలలిత, మల్లీశ్వరి, మసూద ఫేం బాంధవి శ్రీధర్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర నేత నూనె ఉమామహేశ్వరరెడ్డి, సోమసాని ఝాన్సీ, మెట్టు అంజిరెడ్డి, కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి, ఉడుముల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, నూనె వెంకట కోటిరెడ్డి, నూనె గంగాధర్‌రెడ్డి, శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ శనగల సాంబిరెడ్డి, కొండలు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉపకార వేతనాలతో పేద విద్యార్థులకు ఊతం లీగల్ సెల్ రాష్ట్ర నేత పోలూరి వెంకటరెడ్డి చదువుకు పేదరికం ఆటంకం కాకూడదు అందుకే కోటిరెడ్డి ట్రస్టు ద్వారా సేవలు ట్రస్టు వ్యవస్థాపకుడు యేరువ సాయిరామ్ 1,525 మంది విద్యార్థులకు రూ.50 లక్షలు పంపిణీ
సేవలు మరింత విస్తరిస్తాం
యేరువ సాయిరామ్ మాట్లాడుతూ తాను చిన్నతనంలో చదువుకునేందుకు పడిన కష్టం మరే విద్యార్థి పడకూడదన్న సంకల్పంతోనే తండ్రి పేరిట ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తాను విదేశాల్లో పొందిన ఆదాయంలో సింహభాగం పేద విద్యార్థుల ఉన్నతికి ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. చదువుకు పేదరికం ఆటంకం కారాదన్న ఏకై క లక్ష్యంతో ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు. భవిష్యత్తులో మరింత విస్తృతం చేస్తామని ఆయన ప్రకటించారు.