
ఎక్కడో హత్య .. ఇక్కడే దహనం!
యడ్లపాడు: మండలంలో వరుసగా నమోదవుతున్న అజ్ఞాత శవాల దహనం ఘటనలు పోలీసులు సవాలుగా మారాయి. తాజాగా జూన్ 25న ఉదయం 8.30 గంటల ప్రాంతంలో 16వ జాతీయ రహదారి పక్కన పట్టపగలే శవ దహనం స్థానికులను కలవరపెట్టింది. 20 రోజులకు పైగా గడుస్తున్నా ఇప్పటివరకు ఈ కేసు మిస్టరీగానే ఉంది. హత్య చేసిన తర్వాత మృతదేహాలను యడ్లపాడు మండలంలో దహనం చేయడం హంతకుల వ్యూహంలో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు.
మూడేళ్లలో నాలుగు ఘటనలు
గత మూడేళ్లలో మండలంలో మొత్తం నాలుగు శవ దహనాల ఘటనలు నమోదయ్యాయి. బోయపాలెం– వంకాయలపాడు గ్రామాల మధ్యలో హైవే సర్వీసు రోడ్డు పక్కన చెత్తకుప్పలో ఒకరిని, యడ్లపాడు నుంచి చిలకలూరిపేట వెళ్లే మార్గంలో పశువుల కోసం ఏర్పాటు చేసిన అండర్‌పాస్ వంతెన సమీపంలో సుబాబుల్‌తోట పక్కనే ఒకరు, సొలస గ్రామంలోని శ్మశానవాటికలో ఒకరిని కాల్చివేసిన సంఘటనలు వెలుగు చూశాయి. తాజాగా గతనెల 25న జరిగిన ఘటన వీటి జాబితాలోకి వచ్చి చేరింది.
ఆ ఒక్కటే ఆధారం !
చివరగా జరిగిన ఘటనలో మాత్రం ఒక ఆధారం లభించింది. హంతకులు పట్టపగలే ప్లెక్సీ షీట్‌లో చుట్టిన శవాన్ని హైవే పక్కనున్న కాల్వలో పడేసి నిప్పంటించి పరారయ్యారు. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తూ ఆవైపు వెళ్లిన పోలీసులు మంటలు గమనించి, వాహనంలోని నీటితో మంటలను ఆర్పారు. అయితే, అప్పటికే శరీరం పూర్తిగా కాలి బూడిదైంది. ముఖ భాగం మాత్రమే కొంతమేర మిగిలింది. ఆ ఒక్క ఆధారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి గురించి ఏ పోలీస్ స్టేషన్‌న్‌లోనూ మిస్సింగ్ కేసు రిజిస్టర్ కాకపోవడం పోలీసులకు ట్విస్ట్‌గా మారింది. హంతకులు శవాన్ని ెఫ్లెక్సీ షీట్‌తో చుట్టి నిప్పు పెట్టిన విషయం తప్పా హత్యకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఏదీ లభించలేదు. పెట్రోల్ పోసి పూర్తిగా దహనం చేయడంతో ఆధారాలు మిగలకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు శవం ముఖం ఫోటోనే కీలక ఆధారంగా చేసుకుని కేసును ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. క్లూస్‌టీం, డాగ్ సాస్క్యాడ్ సహకారంతో డీఎన్‌ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు చేపట్టారు. ఘటన జరిగిన తేదీన అనుమానాస్పద వ్యక్తుల రాకపోకలపై నిఘా పెట్టారు. ఈ ఒక్క హత్యకేసు ఛేదించగలిగితే మిగిలిన వాటిలో ఏదన్న ఆధారం లభిస్తుందేమోనని పోలీసులు భావిస్తున్నారు.
మిస్టరీగా మారుతున్న శవ దహనాలు ఒకే తీరున మూడేళ్లలో నాలుగో ఘటన పోలీసులకు సవాల్‌గా మారిన కేసులు