
‘కూటమి’ ఒత్తిడితోనే పోలీసులు వేధిస్తున్నారు
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌కు గురిజవోలు బాధితుల ఫిర్యాదు
నరసరావుపేట రూరల్: పోక్సో చట్టం కింద నమోదైన కేసులో బాధితులమైన తమపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలతో నరసరావుపేట రూరల్ పోలీసులు వేధింపుల నుంచి కాపాడాలని నాదెండ్ల మండలం గురిజవోలుకు చెందిన కొండెబోయిన శ్రీనివాసరావు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కోరారు. విజయవాడకు వచ్చిన జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహీర్‌ను గురువారం శ్రీనివాసరావు కలిసి వినతిపత్రం సమర్పించారు. మైనర్ అయిన తన కుమార్తెను అనుసరిస్తూ గ్రామానికి చెందిన పుల్లపు విజయ్ కుమార్ కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. బాలికను హతమార్చే ఉద్దేశంతో కిడ్నాప్ కూడా పాల్పడ్డారని వాపోయారు. పోలీ సులు బాలికను గుర్తించి తమకు అప్పగించారని తెలిపారు. కుటుంబ గౌరవం గురించి ఆలోచించి నిందితుడిపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదన్నారు. విజయకుమార్ బెదరింపుల కారణంగా బాలికను తన అమ్మమ్మ గ్రామమైన నరసరావుపేట మండలం దొండపాడులో ఉంచడం జరిగిందని తెలిపారు. ఆ గ్రామానికి వెళ్లి బాలికను బెదిరించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారని, ఈ సమయంలో మోటర్ సైకిల్, ఫోన్‌లు వదిలి పారిపోయాడని తెలిపారు. విజయకుమార్ వేధింపులతో బాలిక మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో 11 రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించినట్టు పేర్కొన్నారు. బాలిక ఫిర్యాదుతో విజయకుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో విజయకుమార్ కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు గ్రామీణ పోలీస్‌స్టేషన్లో ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలతో అప్పటి నుంచి రూరల్ పోలీసులు తమను వేధిస్తున్నారని తెలిపారు. తనతో పాటు కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని తెలిపారు. ఈనెల 12వ తేదీన తన కుమారుడు పవన్‌కుమార్ స్టేషన్‌కు పిలిపించి కేసును ఒప్పుకోవాలంటూ విచక్షణా రహితంగా కొట్టారని పేర్కొన్నారు. కేసును అంగీకరించకపోతే ఎన్‌కౌంటర్ చేస్తామని బెదరింపులకు పాల్పడుతున్నారని వివరించారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో పనిచేస్తున్న పోలీసుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.వెంగళరావు యాదవ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆళ్ల శివగోపి పాల్గొన్నారు.