
చదువు మధ్యలో ఆపేసిన వారికి దూర విద్య వరం
క్రోసూరు: వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారికి దూర విద్య వరం అని జిల్లా కో–ఆర్డినేటర్ ఎంఏ.హుస్సేన్ తెలిపారు. క్రోసూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం దూరవిద్య అడ్మిషన్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల కో–ఆర్డినేటర్ చిల్కా సురేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ ద్వారా విద్యార్థులు పొందే సర్టిఫికెట్లకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెగ్యులర్ విద్యార్థులతో పాటు సమానమైన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతిలో చేరేందుకు ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 24 సంవత్సరాలు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు. చదవడం, రాయడంతో పాటు ఏదొక తరగతి టీసీ, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు కలిగి ఉండాలని సూచించారు. ఇంటర్‌కు 10వ తరగతి మార్క్స్ సర్టిఫికెట్, టీసీ, బ్యాంకు అకౌంట్ కాపీ అందజేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే కుల ధ్రువీకరణ పత్రాలు, వికలాంగులు అయితే వైకల్యం ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని తెలిపారు. ఫీజు చెల్లింపునకు అపరాధ రుసుం లేకుండా ఈనెల 30 వరకు, రూ.200 అపరాధ రుసుంతో ఆగస్టు 15 వరకు అవకాశం ఉందని తెలియజేశారు. వివరాలకు పని వేళల్లో మండల రిసోర్సు కేంద్రంలో, సచివాలయాల్లో , మండల కో–ఆర్డినేటర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. మీసేవ, ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రామాంజనేయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.