
నకిలీ ధ్రువీకరణ పత్రంతో మోసం
పోలీసు కేసు నమోదు
పెదకాకాని: ప్రభుత్వ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువీకరణ పత్రం తయారు చేసినట్లు మండలం పరిధి వెంగళరావునగర్‌కి చెందిన కూరాకుల వాసుదేవ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూరాకుల సత్యనారాయణ, అనూష దంపతులపై మోసం, నకిలీ పత్రాల తయారీ కేసు నమోదు చేశారు. తమ ఇంటిని విక్రయిస్తామని సత్యనారాయణ దంపతులు చెప్పడంతో 2023లో రూ.15 లక్షలు వారికి ఇచ్చినట్లు వాసుదేవ్ ఫిర్యాదు చేశారు. మిగిలిన రూ.18 లక్షల మొత్తాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించేందుకు ఒప్పందం జరిగింది. బ్యాంకు లోన్ కోసం సదరు ఇంటి సంబంధిత పత్రాలతో వాసుదేవ్ దరఖాస్తు చేసుకున్నప్పుడు సర్వే సర్టిఫికెట్ అవసరమైంది. సత్యనారాయణ ఇచ్చిన సర్టిఫికెట్‌ను నకిలీదిగా పెదకాకాని తహసీల్దార్ కృష్ణకాంత్ తేల్చారు. సహదేవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం పెదకాకాని సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు.
పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు
సంతమాగులూరు(అద్దంకి): సంతమాగులూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నల్ల బర్లీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి రైతూ పండించిన నల్లబర్లీ ఆకు మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పారు. అందుకే కొనుగోలు కేంద్రాలను పెంచుతున్నట్లు తెలిపారు. నూతన మార్కెట్ కమిటీ, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తేలప్రోలు రమేశ్, మరికొంతమంది సభ్యులుగా ప్రమాణీ స్వీకారం చేశారు. కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే అరవిందబాబు, జీవీ ఆంజనేయులు, ఎరిక్షన్‌బాబు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వ్యవసాయ, విజిలెన్స్
అధికారుల తనిఖీలు
రేపల్లె: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులనే విక్రయించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మైలవరం వ్యవసాయ సహాయ సంచాలకులు టి.శ్రీనివాసరావు హెచ్చరించారు. పట్టణంలోని ఫెర్టిలైజర్స్ దుకాణాలపై వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎరువుల దుకాణాల ఎదుట తప్పనిసరిగా స్టాక్ బోర్డును, ధరల పట్టిక వినియోగదారులకు కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. విత్తనాల నాణ్యతలో రాజీపడరాదని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయించరాదన్నారు. దుకాణాలలో స్టాక్‌కు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించి అపరాధ రుసుం విధించారు. కార్యక్రమంలో రేపల్లె వ్యవసాయ సమాయ సంచాలకులు అద్దేపల్లి లక్ష్మి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి మోహన్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మహేష్‌బాబు, విస్తరణ అధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

నకిలీ ధ్రువీకరణ పత్రంతో మోసం