
ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌తో భేటీ
కొరిటెపాడు: ‘లఘు ఉద్యోగ భారతి – ఆంధ్రప్రదేశ్’కు నూతనంగా ఏర్పడిన రాష్ట్ర కమిటీ ప్రతినిధులు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావును మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో కలిశారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు తులసి యోగీష్ చంద్ర, కోశాధికారి ధరణీష్, ఉపాధ్యక్షుడు కమల్ నయన్ భాంగ్, సంయుక్త ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కార్యదర్శి తోట రామకృష్ణ, ఈసీ సభ్యులు విఠల్ ప్రసాద్ కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరిస్తూ కమిటీ వినతిపత్రాన్ని సమర్పించింది. అధిక పారిశ్రామిక విద్యుత్ చార్జీలు, ప్రభుత్వ శాఖల నుంచి ఆలస్యంగా చెల్లింపులు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత, ఆర్థిక సహాయం పొందడంలో ఇబ్బందులు, మెమోరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్‌పై అధిక చార్జీలు ఉన్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు.. నూతన రాష్ట్ర కమిటీకి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎం ఎస్‌ఎంఈల ప్రోత్సాహం, అభివృద్ధి కోసం లఘు ఉద్యోగ భారతితో కలిసి పని చేయడానికి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.