
భూ మాయ చేశాడు!
● తాడికొండలో ఖాళీ స్థలాలు, సామాజిక స్థలాలకు తప్పడు బీ ఫారాలు సృష్టించి అక్రమ అమ్మకాలు ● తమ కుటుంబ సభ్యుల పేరిట కూడా నకిలీ పత్రాలు సృష్టించి గృహ నిర్మాణ పథకానికి దరఖాస్తు ● విషయం బయటకు పొక్కడంతో నకిలీ పత్రాలను బయటకు రాకుండా చూసేందుకు యత్నాలు ● రూ.5.50 లక్షలు ఒకే కుటుంబంలో టోపీ పెట్టడంతో నగదు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ ● స్టాంపులు, వీఆర్వో రిపోర్టు, అధికారుల సంతకాలు, తహసీల్దార్ సంతకం సహా అన్నీ ఫోర్జరీ ● తమకు సంబంధం లేదని చేతులెత్తేసిన రెవెన్యూ అధికారులు.. చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్
తాడికొండ: రాజధానిలో భూముల ధరలకు రెక్కలొచ్చి పడ్డాయి. ఎకరం రూ.కోట్లు పలుకుతుంటే సెంటు భూమి దొరికితే చాలు జీవితాంతం చిన్నపాటి రేకుల షెడ్డు అయినా వేసుకొని బతికేద్దామని ఆశపడుతున్న పేదవాడి కష్టాన్ని దోచుకునేందుకు పక్కా స్కెచ్ వేసి దానిని అమలు చేశాడు ఓ ప్రధాన పత్రిక విలేకరి (సాక్షి కాదు). అనుకున్నదే తడవుగా తనకు రెవెన్యూ శాఖలో అంతా గుప్పెట్లో ఉందని, మీకు భూమి ఇప్పించే బాధ్యత తనదే అంటూ ప్రగల్భాలు పలికాడు. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న ఓ పేద కుటుంబానికి వల విసిరి తీరా నిజం బయటకు పొక్కే సరికి తనకేం సంబంధం లేదంటూ చేతులెత్తేశాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ తంతు తాడికొండలో జరిగింది.
నకిలీ బీఫారాలు అంటగట్టి..
ఆ విలేకరి తనదైన శైలిలో భూ దందాకు తెరలేపి ప్రభుత్వం కేటాయించిన లే అవుట్లలో మిగిలిన ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయో ఆరా తీసి రెవెన్యూ అధికారుల నుంచి మీకు స్థలం ఇప్పిస్తానంటూ ముందుగా ఆ స్థలాలను బాధితులకు చూపించాడు. రాజధాని ప్రాంతంలో తమకూ జాగా వస్తుందంటూ ఆశపడిన పలువురు ఇతని వలలో పడ్డారు. పేరు బయటకు చెప్పేందుకు ఇష్టపడని ఓ పేద కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలకు రెండు నకిలీ బీ ఫారాలు సృష్టించి అంటగట్టి ఇదే మీ స్థలమంటూ ప్రైవేటు సర్వేయర్‌తో కొలతలు వేయించి అప్పజెప్పి రూ.5.50 లక్షల నగదు తీసుకున్నాడు.
● ఇదేదో బాగుందనుకున్న ఆ రిపోర్టర్ చెంచు కాలనీలో సైతం సామాజిక స్థలాలను ఆక్రమించేందుకు తనదైన శైలిలో పథకం వేసి నకిలీ బీ ఫారాలను సృష్టించి రెవెన్యూ స్టాంపులను సైతం వేసి గ్రీన్ కలర్ ఇంకుతో సంతకాలు చేసి మరీ బేరసారాలు మొదలు పెట్టాడు. అయితే అది సామాజిక స్థలాలు కావడంతో కొలతలు వేసేందుకు వెళ్లిన ప్రైవేటు సర్వేయర్‌లను స్థానికులు నిలదీయడంతో అక్కడ నుంచి వెనుదిరిగారు.
● తన కుటుంబ సభ్యులకు సైతం సామాజిక స్థలాల్లో నకిలీ బీ ఫారాలు సృష్టించి గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేశాడు. అయితే అప్పటికే ఈ వ్యవహారం గుట్టు రట్టవడంతో సదరు కాగితాలు బయటకు రాకుండా చూసుకున్నాడు. ఈ వ్యవహారం గ్రామంలో ఆ నోటా ఈ నోటా రావడంతో నకిలీ బీ ఫారాలతో స్థలాలు అమ్మకాలు జరిపిన వ్యవహారం బయటకు పొక్కి బాధితులు తమ నగదు తమకు తిరిగిచ్చేయాలని కోరడంతో తనకేం సంబంధం లేదు.. నాకేం తెలియదు అంటూ బుకాయించడం మొదలు పెట్టాడు.
ఫిర్యాదుకు రంగం సిద్ధం
పేద కుటుంబాలకు ఏదో న్యాయం చేస్తాడని మధ్యవర్తులుగా ఉన్న వ్యక్తులకు ఇది తలనొప్పిగా మారడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలో తాను అన్ని పనులు చేయిస్తానని కొంతమంది అధికారులతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్న నేపథ్యంలో తాము నమ్మామని ఇలా మా కొంప ముంచుతాడని బాధితులు వాపోతున్నారు. తమపేరు బయటకు వస్తే ఎక్కడ బెదిరింపులకు గురిచేస్తారో అనే ఆందోళనతో బాధితులు సొమ్ము పోయి శనిపట్టిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధిత పత్రికా యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం. నకిలీ పత్రాల వ్యవహారం ఇంతటితోనే ఆగిందా లేక ఇంకా ఏదైనా తప్పుడు పత్రాలు సృష్టించి మాఫియా చేశాడా అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సంబంధిత రెవెన్యూ అధికారులు ఇకనైనా దృష్టి సారించి నకిలీ పత్రాలతో పేదలను మోసం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
నకిలీ బీ ఫారాలతో ఓ పత్రికా విలేకరి భూ దందా
తప్పకుండా చర్యలు తీసుకుంటాం..
దీనిపై తహసీల్దార్ మెహర్ కుమార్‌ను వివరణ కోరగా బయటి వ్యక్తులు మోసం చేసేందుకు రకరకాల తప్పులు చేస్తుంటారని, వాటితో మాకు సంబంధం లేదన్నారు. రికార్డుల్లో లేకుండా ఎవరైనా తప్పులు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విలేకరి విషయం ఇంకా తమ దృష్టికి రాలేదని, వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.