
తాగునీటికి కటకట
తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): సమస్యలు పరిష్కారించాలనే డిమాండ్‌తో ఈ నెల 13వ తేదీ నుంచి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం గుంటూరు నగరంలో తాగునీటి సరఫరాపై స్పష్టంగా కనిపిస్తోంది. నగరపాలక సంస్థ పరిధిలో హెడ్ వాటర్ వర్క్(తక్కెళ్లపాడు), ఉండవల్లిలో పనిచేసే ఇంజినీరింగ్ విభాగం అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులకు గైర్హాజరవడంతో నగరంలో తీవ్ర తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. గుంటూరు నగరానికి కృష్ణా నది నుంచి రా వాటర్ ఉండవల్లి పంపింగ్ హౌస్ నుంచి తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్‌కు వస్తుంటుంది. ఇక్కడ ఫిల్టర్ అయిన తరువాత గుంటూరు నగరంలో 64 వాటర్ ట్యాంకులకు సరఫరా అవుతాయి. దీంతో పాటు సంగం జాగర్లమూడి నుంచి గుంటూరుకు తాగునీరు సరఫరా అవుతుంది. ప్రధానంగా కృష్ణా నది నుంచి గుంటూరుకు 135 ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్ పర్ డే), సంగం జాగర్లమూడి నుంచి సుమారు 20 ఎంఎల్‌డీ నగరానికి సరఫరా అవుతుంది. కృష్ణా నది నుంచి వచ్చిన రా వాటర్‌ను తక్కెళ్లపాడులో కార్మికులు ఫిల్టరైజేషన్ ద్వారా శుద్ధీకరిస్తుంటారు. అయితే కార్మికుల గైర్హాజరీతో లేక ఫిల్టరైజేషన్‌కు, సరఫరాకు గండిపడింది.
ప్రైవేట్ వ్యక్తులతో విధులు.. కాలిపోయిన మోటార్లు
కార్మికుల సమ్మె కారణంగా నగరపాలక సంస్థ అధికారులు రూ.వెయ్యి నుంచి 1500 చొప్పున ఇచ్చి ప్రైవేట్ వర్కర్లను విధుల్లోకి తీసుకుని వాటర్ పంపింగ్ జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే వీరికి సరైన అవగాహన లేకపోవడంతో పంపింగ్ సమయంలో వేయాల్సిన మోటార్లు కాకుండా వేరే మోటార్లును ఆన్ చేయడం ద్వారా మోటార్లు కాలిపోయే పరిస్థితి నెలకొంది.
సగమే సరఫరా
దీంతో పాటు నగరానికి రావాల్సిన 150 ఎంఎల్‌డీలో కేవలం 70 నుంచి 80 ఎంఎల్‌డీ మాత్రమే తాగునీరు వస్తోంది. నెహ్రూనగర్ వాటర్ ట్యాంకుల వద్ద 24 గంటలు మోటార్లు రన్ అయితేనే పశ్చిమ నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నెహ్రూనగర్ వాటర్ ట్యాంకులకు ఆశించిన స్థాయిలో తాగునీరు రాకపోవడంతో 24 గంటలు రన్ అవ్వాల్సిన మోటార్లు..ఆగి ఆగి 10 గంటలు కూడా రన్‌కాని పరిస్థితి నెలకొంది. దీంతో పశ్చిమ ప్రజల గొంతు ఎండుతోంది.
పరిష్కారం చూపాలి
మాకు గత రెండు రోజులుగా తాగునీరు సక్రమంగా రావడం లేదు. దీంతో చేసేదేమి లేక మినరల్ వాటర్ కొనుక్కొని ఇంటిలో అవసరాలను తీర్చుకుంటున్నాం. అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలి.
– సాయి కిరణ్, రాజీవ్‌గాంధీనగర్
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కార్మికుల సమ్మె వలన నగరంలో తాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్య ఉత్పన్నమవ్వకుండా ఇంజినీరింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్‌ని పరిశీలించారు. కార్మికుల సమ్మె వలన తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా ఇంజినీరింగ్ అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి చర్యలు తీసుకోవాలన్నారు. ఉండవల్లి నుంచి నీటి సరఫరాకు, ఫిల్టరైజేషన్‌కు సమస్య రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈఈని ఆదేశించారు.
సమ్మె పభ్రావం.. నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం

తాగునీటికి కటకట