
హోం మంత్రి ఏం చేస్తున్నారు?
దళితులపై వరుస దాడులు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): దళిత వర్గాలపై మూకుమ్మడి దాడులు జరుగుతుంటే... దళిత హోంశాఖ మంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. దళితులపై జరుగుతున్న దాడులపై హోం మంత్రి స్పందించాలని, వాటిని ఖండించకపోతే దళిత జాతి క్షమించదన్నారు. దాడులకు గురైన దళితులను పరామర్శించే సమయం కూడా లేదా అని ధ్వజమెత్తారు. పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి రమేష్ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న బొనిగల నాగమల్లేశ్వరావును చూసేందుకు యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి గుంటూ రు వచ్చారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పి, నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
దళితులంటే టీడీపీ నేతలకు చిన్నచూపు
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గతంలోనూ... ఇప్పుడు రౌడీ రాజకీయాలు మానుకోలేదని ధ్వజమెత్తారు. అసలు దళితులంటేనే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు చిన్నచూపని, దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇక పొన్నూరు నియోజకవర్గంలో బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న నాగమల్లేశ్వరరావును ధైర్యంగా ఎదుర్కోలేక అంతం చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. గత 13 రోజులుగా నాగమల్లేశ్వరరావు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా.. కూటమి ప్రభుత్వంలోని ఏ మంత్రి, ఎమ్మెల్యే పరామర్శించకపోవటం సిగ్గుచేటన్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని తెలిపారు.
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉన్న నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులకు పరామర్శ
నరేంద్రను ఏ1గా చేర్చాలి
వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, నాగమల్లేశ్వరావుపై దాడిని చేయించటమే కాకుండా, ఆయన ప్రాణాల కోసం పోరాడుతుంటే.. ఏదో చిన్న ఘటనను పట్టుకుని గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనలో నరేంద్రను ఏ1గా చేర్చాలని డిమాండ్ చేశారు.