
టీడీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఇద్దరికి తీవ్రగాయాలు
గుంటూరు రూరల్: అధికార దాహం ఒక పక్క, అందినకాడికి దోచుకోవాలనే కాంక్ష మరో పక్క.. వెరసి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి చౌడవరం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా చౌడవరం గ్రామంలో టీడీపీ రాష్ట్ర మీడియా కో–ఆర్డినేటర్, స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు గింజుపల్లి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు జరిగాయి. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మద్యం తాగి పాత కక్షలను గుర్తు చేసుకుని ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లు, రాడ్లు, కత్తులతో దాడులు చేసుకున్నారు. గ్రామానికి చెందిన యడ్లపల్లి మణికంఠ, అతని స్నేహితుడు తూర్పుగోదావరి జిల్లా వాసి కాట్రగడ్డ ధర్మతేజ అలియాస్ టింకు అనే వ్యక్తి వారి అనుచరులతో ఈదులపాలెంకు చెందిన ఇమ్మెల శరత్ బాబును, అతని సోదరుడు ఎమ్మెల్యే రామస్వామిని కుర్చీలతో, రాళ్లతో తీవ్రంగా గాయపరిచారు. గతంలో శరత్‌బాబుకు, మణికంఠకు అక్రమ మైనింగ్ విషయంలో గొడవలు జరిగాయని స్థానికులు తెలిపారు. పాత కక్షలు మనసులో పెట్టుకొని తమను చంపటానికి ప్రయత్నం చేశారని శరత్‌బాబు తమ బంధువులకు తెలిపారని తెలిసింది. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితుడు శరత్‌బాబు కోరుతున్నారు.

టీడీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ