
సార్వత్రిక సమ్మె విజయవంతం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం గుంటూరులో చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. బ్యాంకింగ్, ఎల్‌ఐసీ, పోస్టాఫీసు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామీణ బ్యాంకుల్లో సైతం అధికారులు సమ్మెకు పిలుపు ఇవ్వటంతో పూర్తిగా మూతపడ్డాయి. జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొనటంతో లావాదేవీలు స్థంభించాయి. ఎస్‌ఐసీలోనూ ఉద్యోగులు పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొన్నారు. అదే విధంగా కార్మికులు పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొనటంతో మిర్చియార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గోడౌన్‌లలో కార్యకలాలు పూర్తిస్థాయిలో స్థంభించాయి. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్‌లు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి బీఆర్ స్టేడియం వరకూ వందలాది మంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ వర్కర్లు, ఆటో కార్మికులు, ఎన్‌జిరంగా యూనివర్సిటీ కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వాలు
ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కనీస వేతన చట్టం, బోనస్ చట్టం, పనిగంటల వంటి దాదాపు 29 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్‌లుగా మార్చారని విమర్శించారు. రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల విధానాలు అనుసరిస్తూ, కార్మికులను రోడ్డున పడేశాయన్నారు. సీఐటీయూ నగర కార్యదర్శి కె.శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎ.అరుణ్‌కుమార్ అధ్యక్షత వహించగా ఎఐఎఫ్‌టీయూ న్యూ నాయకులు యు.నాగేశ్వరరావు, రైతుకూలీ సంఘం నాయకులు విష్ణు, ఏరువాక రైతు సంఘం పి.కోటేశ్వరరావు, సీఐటీయూ నాయకులు బి.ముత్యాలరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్.అరుణ, ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పి.సాయికుమార్, ఏపీ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.సువర్ణబాబు సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, సీపీఎం నేత నళినీకాంత్ పాల్గొన్నారు.
గుంటూరులో వామపక్షాల భారీ ర్యాలీ