
గుర్తింపు ఏదీ..?
కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు అందేనా!
కొరిటెపాడు(గుంటూరు): అన్నదాతలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీలో తీవ్ర అలసత్వం చూపిస్తోంది. ఫలితంగా కార్డులు అందక.. బ్యాంక్ రుణాలు దక్కక కౌలు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 సీజన్‌కు గానూ జిల్లాలో 46,400 కౌలు రైతులకు గుర్తింపు కార్డుల పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 9,424 మందికి మాత్రమే సీసీఆర్‌సీ కార్డులు పంపిణీ చేశారు. నిజానికి గుంటూరు జిల్లావ్యాప్తంగా అధికారికంగా సుమారు 50 వేల మందికి పైగా కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. కానీ వాస్తవంగా జిల్లాలో 60 వేల మందికి పైగానే కౌలు రైతులు ఉన్నారు. కార్డుల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు గ్రామ సభలు నిర్వహించలేదు.
గ్రామ సభలు ఏవీ?
సాధారణంగా పంటల సీజన్ మొదలవ్వగానే కౌలు రైతుల గుర్తింపు కార్డుల పంపిణీకి సంబంధించి రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి కౌలు రైతులను గుర్తించి కార్డులు మంజూరు చేస్తారు. కానీ అలాంటి ప్రక్రియ జరగడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పంటల సాగుకు బయట వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంటోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 46,400 కౌలు కార్డులు మంజూరు లక్ష్యంగా ఉండగా ఇప్పటికి 9,424 కార్డులు మాత్రమే మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.
కౌలు రైతులకు అండగా వైఎస్ జగన్ సర్కార్..
కౌలు రైతులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. భూ యజమానుల హక్కులకు భంగం కలుగకుండా కేవలం 11 నెలల కాలానికి సాగు ఒప్పందం చేస్తూ 2011 కౌలు చట్టాన్ని సవరించింది, ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి ఒక సారి జారీ చేసిన కార్డును మళ్లీ భూ యజమాని అంగీకారం మేరకు రెన్యూవల్ చేసుకునే వీలు కల్పించారు. భూ యజమానుల్లో అపోహలు తొలగించడంతో జిల్లాలో సీసీఆర్‌సీ కార్డుదారులు జారీ గణనీయంగా పెరిగాయి. అసలు రైతుల మాదిగా కౌలు రైతులకు పంట రుణాలు అందించడంతో పాటు వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా పరిహారం అందించి అండగా నిలిచింది.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా అరకొర కార్డులే.. బ్యాంక్ రుణాల కోసం కౌలు రైతుల ఎదురు చూపులు జిల్లా లక్ష్యం 46,400 సీసీఆర్‌సీ కార్డులు ఇప్పటివరకు మంజూరు చేసింది 9,424 మందికి మాత్రమే

గుర్తింపు ఏదీ..?