
నేటి నుంచి గౌరీ విశ్వేశ్వరాలయ శతాబ్ది ఉత్సవాలు
నగరంపాలెం: గుంటూరు బ్రాడీపేట 2/7వ అడ్డరోడ్డులోని గౌరీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం శతాబ్ది మహోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. గుంటూరు నగర పరిధిలో పురాతనమైన వంద ఏళ్లకు పైబడిన శివాలయాలు ఆరుకు పైగా వెలిశాయి. అందులో శ్రీగౌరీవిశ్వేశ్వరస్వామి వారి దేవస్థానం ఒకటి. 1925 జూన్ 12న ప్రతిష్టించినట్లు ప్రధాన అర్చకుడు జంధ్యాల సుబ్రమణ్యశాస్త్రి బుధవారం తెలిపారు. ఈనెల పదిన ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి 14వ తేదీ వరకు పాంచాహ్నికంగా నిర్వహిస్తారు. ఈనెల పదిన లక్ష బిల్వార్చన, 11న గౌరీదేవికి లక్ష కుంకుమార్చన నీరాజన మంత్ర పుష్ప, 12న ఆంజనేయస్వామికి లక్ష నాగవల్లీ దళార్చన నీరాజన మంత్ర పుష్పాలు, 13న లక్ష్మీనారాయణ స్వామికి లక్ష తులసీ దళార్చన, 14న స్వామి వారికి శాంతి కల్యాణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.