
సర్కారు తీరుతో ‘పాఠశాల విద్య’లో గందరగోళం
లక్ష్మీపురం: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను జీవో నెం. 19, 20, 21ల ద్వారా 9 రకాలుగా విభజించి వేల సంఖ్యలో ఉపాధ్యాయులను మిగులుగా చూపించి పాఠశాల విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తోందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.రఘునాథ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కొత్తపేట జిల్లా సీపీఐ కార్యాలయంలో మల్లయ్య లింగం భవన్‌లో ఎస్‌టీయూ జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో ఉన్న జీవో నెం.117 అనేది ఉన్నత పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. దాన్ని రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు జివోలు దాంతోపాటు ప్రాథమిక పాఠశాల వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఏఐఎస్‌టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్‌జీటీల ప్రమోషన్‌లకు గండి కొట్టేలా నిర్ణయాలు ఉన్నాయన్నారు .ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులను మూడు రకాలుగా విభజించడం విడ్డూరమన్నారు. ఎస్‌టీయూ ప్రధాని కార్యదర్శి కె.సుబ్బారెడ్డి మాట్లాడుతూ బదిలీల విషయంలో ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తెచ్చి ఆవేదనకు గురి చేస్తోందన్నారు. ఎస్‌టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె. కోటేశ్వర రావు, రాష్ట్ర కౌన్సిలర్ సీహెచ్ ప్రకాష్ రావు ఆయా సభ్యులు అడిగిన విషయాలను వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.