
నేత్రపర్వం.. రథోత్సవం
అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం
పొన్నూరు: గోవిందా.. గోవిందా నామస్మరణతో సోమవారం పొన్నూరు పట్టణం మార్మోగింది. పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావన్నారాయణ స్వామివారి దివ్య రథోత్సవం స్వర్ణపురి వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనంతో పురవీధులు కిటకిటలాడాయి. స్వామి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల నుంచి అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం రాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణం మహోత్సవం కనుల పండువగా జరిగింది. నిడుబ్రోలు వాస్తవ్యులు, పద్మశాలీ బహూత్తములు చింతక్రింది కిషోర్ కుమార్, వారి సోదరులు స్వామివారికి తలంబ్రాలు సమర్పించగా, అనువంశీక ధర్మకర్తలు శ్రీమంత్ రాజా వాసిరెడ్డి సుధా స్వరూప్ బహుద్దూర్ మన్నే సుల్తాన్ దొర ఆధ్వర్యంలో స్వామికి తలంబ్రాలు పోశారు.
పొన్నూరు భక్తజన సంద్రం
సోమవారం ఉదయం గరుడోత్సవం, మధ్యాహ్నం దేవస్థానంలో బ్రాహ్మణ సమారాధన అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో పూలతో విశేషంగా అలంకరించిన రథంపై స్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, స్వామి నామస్మరణతో వీధులన్నీ మార్మోగాయి. ఆలయ ప్రాంగణం నుంచి కసుకర్రు రోడ్డు వరకు రథోత్సవం సాగింది. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పాందారు. స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి భక్తులు ముగ్దులయ్యారు. సుమారు మూడు గంటల పాటు రథోత్సవం సాగింది. భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మజ్జిగ, తాగునీరు అందించారు. చీమకుర్తి నాగభూషణరావు, పాములపాటి కృష్ణయ్య, పీ.టీ చౌదరి, కమలేంద్రనాథ్, కొండముది రామకృష్ణారావు, రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్పీ జనార్ధనరావు ఆధ్వర్యంలో పట్టణ సీఐ వీరానాయక్, ఎస్‌ఐ శ్రీహరితో పాటు పలువురు ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఈఓ, సిబ్బంది పర్యవేక్షించారు.
వైభవంగా సాక్షి భావన్నారాయణ
స్వామి రథోత్సవం
గోవింద నామస్మరణతో మార్మోగిన పొన్నూరు వీధులు

నేత్రపర్వం.. రథోత్సవం