ఎలక్ట్రిక్‌ బస్సులు వితరణ | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ బస్సులు వితరణ

Mar 11 2025 1:42 AM | Updated on Mar 11 2025 1:41 AM

మంగళగిరి: మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నృసింహస్వామి కొండతోపాటు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కు రెండు ఎలక్ట్రిక్‌ బస్సులను మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కంపెనీ సోమవారం అందజేసింది. బస్సులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఎలక్ట్రిక్‌ బస్సులను అందజేసింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండ్‌ నుంచి ఎన్‌ఆర్‌ఐ జంక్షన్‌, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్‌కు వెళ్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండ్‌ నుంచి ఎన్‌ఆర్‌ఐ జంక్షన్‌ మీదుగా శ్రీ పానకాలస్వామి కొండకు వెళ్తుంది. ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, ఎండీ కేవీ ప్రదీప్‌, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ శాంతా సింగ్‌, డిప్యూటీ డైరెక్టర్‌ శశికాంత్‌, ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నందం అబద్దయ్య పాల్గొన్నారు.

మాల్‌ ప్రాక్టీసు కేసు నమోదు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో సోమవారం తొలి మాల్‌ ప్రాక్టీసు కేసు నమోదైంది. పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ద్వితీయ సంవత్సరం గణితం–2బీ పరీక్షకు గుంటూరు జిల్లాలోని 87 పరీక్షా కేంద్రాల పరిధిలో 28,274 మంది విద్యార్థులు హాజరయ్యారు. 446 మంది గైర్హాజరయ్యారు. గుంటూరులోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీయింగ్‌కు ప్రయత్నించిన ఓ విద్యార్థిపై అధికారులు మాల్‌ ప్రాక్టీసు కేసు నమోదు చేశారు. ఆర్‌ఐవో జీకే జుబేర్‌ ఐదు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

మంగళగిరి: సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం మంగళగిరి మండలంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి సోమవారం పరిశీలించారు. సంయుక్త కలెక్టర్‌ ఎ.భార్గవ్‌ తేజ, తెనాలి సబ్‌ కలెక్టర్‌ సంజనా సింహ, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, అధికారులతో కలిసి ఆమె వర్సిటీని సందర్శించారు. సీఎం ప్రారంభించనున్న సీవీ రామన్‌ బ్లాక్‌, ప్రసంగించనున్న అబ్దుల్‌ కలామ్‌ ఆడిటోరియం తదితర ప్రదేశాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నారాయణరావు, ప్లానింగ్‌ ఈడీ వీఆర్‌ అలపర్తి, సెక్రటరీ అనంత్‌ సింగ్‌, రిజిస్ట్రార్‌ ఆర్‌. ప్రేమ్‌కుమార్‌, సీఎల్‌ఎం డైరెక్టర్‌ అనూప్‌సింగ్‌, జీఎం రమేష్‌బాబు పాల్గొన్నారు.

బీఈడీ పరీక్ష రద్దు

ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 7న జరిగిన బీఈడీ మొదటి సెమిస్టర్‌ పర్సెక్టీవ్‌ ఇన్‌ చైల్డ్‌ డెవలప్మెంట్‌ పరీక్షను వీసీ ఆచార్య కె.గంగాధర్‌రావు ఆదేశాల మేరకు రద్దు చేశామని సీఈ ఏ శివప్రసాద్‌రావు సోమవారం తెలిపారు. ఈ పరీక్షను ఈ నెల 12వ తేదీన తిరిగి నిర్వహిస్తామని వెల్లడించారు.

యార్డుకు

1,61,169 బస్తాల మిర్చి

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు సోమవారం 1,61,169 బస్తాల మిర్చి రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 1,30,718 బస్తాలు విక్రయించారు. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement