ప్రజల భాషను ప్రజలకు చేర్చిన గిడుగు  

Telugu Language Day 2021: Gidugu Venkataramurthi Contribution To Telugu - Sakshi

నేడు గిడుగు వెంకటరామ్మూర్తి జయంతి; తెలుగు భాషా దినోత్సవం 

సాహిత్యం సామాన్యులకు చేరువ కావాలన్నా, పాలనా ఫలాలు ప్రజలందరికీ దక్కాలన్నా, పత్రికలు పది కాలాల పాటు మనుగడ సాగించాలన్నా ప్రజల భాషకే పెద్దపీట వేయాలని గట్టిగా నమ్మి, ఆ దిశగా ఉద్యమించి, తర్వాతి తరాలకు స్ఫూర్తినిచ్చిన భాషోద్యమ నేత గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు. సాహితీ లోకానికి, భాషా రంగానికి, రచనా రంగానికి, పత్రికా వ్యవస్థకు గిడుగు చేసిన సేవ కళింగాంధ్ర విశిష్టతను, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. 

1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పర్వతాల పేట(తెనుగుపెంట)లో జన్మించిన గిడుగు ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసి (జైపూర్‌ రాజాగా ఖ్యాతిగాంచిన రాజా విక్రమదేవ్‌ కూడా ఈ గ్రామవాసే), హైస్కూల్‌ విద్యను విజయ నగరంలో పూర్తి చేశారు. 1880లో పర్లాకిమిడి (నేడది గజపతి జిల్లా కేంద్రం) రాజా సంస్థానంలో మిడిల్‌ స్కూల్‌ ఉపాధ్యాయునిగా ఉద్యోగం దొరకడంతో తన మకాం అక్కడికి మార్చారు. పనిచేస్తూ 1886లో ఎఫ్‌ఏ, 1895లో బీఏ పూర్తి చేశారు. పర్లాకిమిడి ఫస్ట్‌ గ్రేడ్‌ కళాశాలలో చరిత్ర లెక్చరర్‌గా పనిచేశారు. ఆ కాలంలోనే వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టారు. దాని కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజలను, రచయితలను చైతన్య పరిచారు. వ్యవహారిక భాష ఆవశ్యకతను తెలియజేస్తూ పత్రికల్లో రచనలు చేయడం మొదలుపెట్టారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, పురిపండా అప్పలస్వామి, తాపీ ధర్మారావువంటి సాహితీ మిత్రుల సహకారంతో గ్రాం«థిక వాదులను ఎదురించి సంచలనాత్మక రచనలు, సంచలనాత్మక ప్రసంగాలు చేశారు.

ప్రజల భాషే పత్రికల భాష
రాజాస్థానాలు, జమీందారుల కొలువుల్లో వుండే భాష కాకుండా ప్రజల నాలుకల్లో  నలిగే భాషనే ప్రోత్సహించాలని గట్టిగా ఆకాంక్షించి పాత్రికేయునిగా మారారు గిడుగు. స్వీయ సంపాదకత్వంలో 1919 సెప్టెంబర్‌లో పర్లాకిమిడి నుంచి ‘తెలుగు’ మాసపత్రికను ప్రారంభించారు. దీనిలో గిడుగు రాసిన వ్యాసాలు, సంపాదకీయాలు తీవ్రచర్చకు, భాషా, పత్రికా రంగాలపరంగా తీవ్ర మార్పులకు కారణమయ్యాయి. తెలుగుభాషలో వ్యవహారి కంగా వచ్చిన మొట్టమొదటి పత్రిక, కళింగాంధ్ర చరిత్రకు ఖ్యాతి తెచ్చిన పత్రిక ఈ ‘తెలుగు’.
విశ్వవిద్యాలయాల్లో బోధన, వాడుక భాషల్లో జరిగేలా చేసిన సంస్కరణవాదిగా గిడుగును పేర్కొనవచ్చు. పాఠ్యాంశా ల ముద్రణ, నిర్వహణ, పరిశోధనలు, పాలనా వ్యవహారాలు వ్యవహారికం లోనే జరగాలని ఉద్యమించారు. తర్వాతి కాలం లో చరిత్రకారునిగా, శాసన పరిశోధ కునిగా ఖ్యాతి గాంచారు. సవర భాషకు లిపి సృష్టికర్తగా మారారు. పర్లాకిమిడి రాజా పద్మనాభదేవు కోరికపై ప్రసిద్ధి శైవక్షేత్రం అయినటు వంటి శ్రీముఖ లింగక్షేత్రంలో 9, 10, 11 శతాబ్దాలకు చెందిన ప్రాచీన శాసనాలను పరిశోధించి గ్రంథస్థం చేశారు. 

భాషే శ్వాసగా...
భాష, పత్రిక, పరిశోధన రంగాలకు చేసిన సేవకుగానూ ఎన్నో పురస్కారాలు, సత్కారాలు గిడుగు ముంగిట వాలాయి. మద్రాస్‌ ప్రభుత్వం ‘రావు బహుద్దూర్‌’(1913), బ్రిటిష్‌ ప్రభుత్వం ‘కైజర్‌– ఇ–హిందూ’ (1933), ఆంధ్ర విశ్వ విద్యాలయం ‘కళాప్రపూర్ణ’ (1938) బిరుదులతో గౌర వించాయి. జీవించిన 77 ఏళ్లలో 60 ఏళ్ల పాటు తెలుగు భాషా వికాసానికి పాటుపడిన గిడుగు చిరస్మణీయులు. భాషాపాలిత రాష్ట్రాల విభజన కారణంగా 50 సంవత్సరాల పాటు నివసించిన పర్లాకిమిడి ఒరిస్సా రాష్ట్రంలో చేరిపోవడంతో బాధాతప్త హృదయంతో రాజమండ్రి చేరి అక్కడే స్థిరపడ్డారు. భాషాభిమానులు శ్రీకాకుళంలో నాగావళి వంతెన వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, హైదరాబాద్‌లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తన భాషా అధ్యయన కేంద్రానికి గిడుగు పేరును పెట్టి నివాళులు అర్పించింది. ఆయన పుట్టిన పర్వతాలపేటలో గిడుగు విగ్రహాన్ని భాషా భిమానులు, గ్రామస్తులు ఏర్పాటు చేయగా ఆంధ్రప్రదేశ్‌ శాసససభ స్పీకర్‌ వారం రోజుల క్రితం ఆవిష్కరించారు. 

భాషలోని మాండలికాలు సజీవంగా వుండాలని, ప్రజల భాషలోనే పత్రికలు పయనించాలని పథనిర్దేశం చేసిన గిడుగు పుట్టిన రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం కళింగాంధ్రకు ఎంతో గర్వకారణం. తెలుగు జాతి ఉన్నంత వరకు గిడుగు జాడ కనిపిస్తూనే వుంటుంది. 1940 జనవరి 22న తుదిశ్వాస విడిచిన గిడుగు అందించిన వ్యవహారభాషా స్ఫూర్తిని కాపాడుకుంటేనే నిజమైన భాషా వారసులం కాగలం.

– డా. జి.లీలావరప్రసాదరావు
అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జర్నలిజం పీజీ శాఖ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top