ఏక నాయకత్వం చైనాకు మేలేనా?

Single Leadership Good For China Xi Jinping - Sakshi

విశ్లేషణ

మావోయిస్టు అతివాదపు విధ్వంసక దశాబ్దాల అనంతరం సామూహిక నాయకత్వ శైలిని చేపట్టేలా చైనా కమ్యూనిస్టు పార్టీని ముందుకు నడిపారు డెంగ్‌ జియావోపింగ్‌. తదనుగుణంగా అధ్యక్ష పదవిని ఎవరైనా రెండు సార్లే చేపట్టేలా, పదవీ విరమణ వయసు 68 ఏళ్లకే పరిమితమయ్యేలా నిర్ణయమైంది. ఏక నాయకుడి అధికారానికి చెక్‌ పెట్టే ప్రయత్నమది. కానీ జిన్‌పింగ్‌ ఈ నిబంధనలన్నీ పక్కన పెట్టేశారు. పార్టీ 20వ కాంగ్రెస్‌ ముగింపు రోజున పొలిట్‌ బ్యూరో స్టాండింగ్‌ కమిటీ సభ్యులను వేదికపై పెరేడ్‌ చేయించినప్పుడు జిన్‌పింగ్‌ అధికార కేంద్రీకరణ స్వరూపం తేటతెల్లమైంది. తన అధికారం మీద ఏ తనిఖీ లేని అధినేత పాలన తెచ్చే పర్యవసానాలను చైనా మరోసారి ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇటీవల ముగిసిన చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) 20వ కాంగ్రెస్‌ సాధించిన అతి ముఖ్యమైన ఫలితం ఏమిటంటే, పార్టీ జనరల్‌ సెక్రటరీగా షీ జిన్‌పింగ్‌ మూడోసారి ఎన్నికై రికార్డు సృష్టించడమే. మరోరకంగా చెప్పాలంటే, చైనా ప్రజా రిపబ్లిక్‌ అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ పొడిగింపునకు ఇది నాంది. అలాగే, శక్తిమంతమైన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ చైర్మన్‌గా మరో పర్యాయం తన పొడిగింపునకు, బహుశా జీవితకాల పొడిగింపునకు కూడా ఇది నాంది.

మావోయిస్టు అతివాదానికి సంబంధించిన విధ్వంసక దశాబ్దాల అనంతరం చైనాకు నాయకత్వం వహించిన డెంగ్‌ జియావోపింగ్, సామూహిక నాయకత్వ శైలిని చేపట్టేలా చైనా కమ్యూనిస్టు పార్టీని ముందుకు నడిపించారు. తదనుగుణంగా అధ్యక్ష పదవిని ఎవరైనా రెండు సార్లు మాత్రమే చేపట్టాలనీ, విరమణ వయసును 68 సంవత్స రాలకు పరిమితం చేయాలనీ పార్టీ నిర్ణయించింది. కానీ 2017లో జరిగిన 19వ పార్టీ కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవికి పరిమితులు ఎత్తివేసి, అత్యంత శక్తిమంతుడిగా ఆవిర్భవించేలా జిన్‌పింగ్‌ ఈ నిబంధనలు అన్నింటినీ పక్కనపెట్టేశారు. 

కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగంలో రెండు కీలకమైన రాజకీయ భావనలను ప్రవేశపెట్టడంతో జిన్‌పింగ్‌ శక్తి నిరూపితమైంది. పార్టీలో ‘రెండు వ్యవస్థాపనలు’ అనే ఈ భావనలు జిన్‌పింగ్‌ని ‘కోర్‌’ గానూ, ఆయన భావాలను పార్టీ పాలనలో కీలకమైన సిద్ధాంతంగానూ ఆమో దించాయి. ఇక ‘రెండు రక్షణలు’ అనేవి జిన్‌పింగ్‌ స్థాయిని, చైనాలో పార్టీ కీలక పాత్రను పరిరక్షించాలని పిలుపునిచ్చాయి.

20వ కాంగ్రెస్‌ ముగింపు రోజున చైనాలో కీలక పాలనా బృందమైన కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో స్టాండింగ్‌ కమిటీ (పీబీఎస్‌సీ) సభ్యులను వేదికపై పెరేడ్‌ చేయించినప్పుడు జిన్‌పింగ్‌ అధికార కేంద్రీకరణ స్వరూపం స్పష్టంగా కనిపించింది. వారంతా జిన్‌పింగ్‌ కీలక మిత్రులు. వారి నియామకానికి విధేయతే కీలక అంశంగా నిలిచిందని సంకేతమిచ్చింది.

సీపీసీ అపెక్స్‌ బాడీలో జిన్‌పింగ్‌ తర్వాత నంబర్‌ 2 ఎవరంటే లీ క్వియాంగ్‌. నూతన ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ 2023 మార్చిలో సమావేశమవుతున్నప్పుడు ప్రధానమంత్రి లీ కికియాంగ్‌ స్థానంలో ప్రధాని కాబోయేది లి క్వియాంగే మరి. లీ క్వియాంగ్‌ ప్రస్తుతం షాంఘైలో సీపీసీ చీఫ్‌గా పనిచేస్తున్నారు. ఇక కొత్తగా నియమితులైన ఇతరులు ఎవరంటే– బీజింగ్‌ పార్టీ అధ్యక్షుడు కై క్వి, షీ జిన్‌పింగ్‌ మాజీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ డింగ్‌ గ్సూగ్జియాంగ్, గ్వాంగ్‌ డాంగ్‌ రాష్ట్ర పార్టీ నేత లీ షీ.

ప్రధాని లీ కికియాంగ్, ఉపప్రధాని వాంగ్‌ యాంగ్‌లను పీబీఎస్‌సీ నుంచి తొలగించారు. ఈ ఇద్దరి వయస్సు 67 సంవత్స రాలు. మరొక దఫా కూడా వీరికి బాధ్యతలు ఇవ్వవచ్చని భావిం చారు. 67 సంవత్సరాలు వచ్చిన మరో నేత వాంగ్‌ హనింగ్‌ని మాత్రం తిరిగి ఎన్నుకున్నారు. ఆయన కూడా జిన్‌పింగ్‌ సహచరుడు. ఒక ప్పుడు జిన్‌పింగ్‌ వారసుడిగా పరిగణన పొందిన ఉపప్రధాని హు చున్‌హువా పీబీఎస్‌సీలో సభ్యత్వం పొందడంలో విఫలమయ్యారు. మొత్తంగా ఆయన్ని పొలిట్‌ బ్యూరో నుంచే తప్పించారు.

నూతన నాయకుల జాబితాలో గుర్తించదగిన విషయం ఏమి టంటే, శిక్షణ పొందిన ఆర్థికవేత్త అయిన లీ కికియాంగ్‌ వంటి నేతలను తప్పించడమే. మరో ఇద్దరు ముఖ్యమైన నేతలను (పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా గవర్నర్‌ యీ గాంగ్, బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ గువో షుకింగ్‌) కూడా కొత్త సెంట్రల్‌ కమిటీ నుంచి తప్పించారు. ఆర్థిక విధానాల్లో ఉదారవాద వైఖరిని ప్రదర్శించిన వారిని పదవుల నుంచి తప్పించా రని అంచనా. 

వ్యక్తిగత అధికారం మీద రాజ్యాంగ పరంగా ఉన్న ఒకే ఒక్క కీలక మైన పరిమితిని పక్కకు పెట్టేయడంతో, ఆ అధికారాన్ని వినియోగించ   డంలో ఉన్న నియంత్రణలను కూడా జిన్‌పింగ్‌ పక్కకుపెట్టేస్తారని ఆందోళన నెలకొంది. జాతీయవాద విధానాలకు, చైనా రోజువారీ జీవితంలో సీపీసీ పాత్ర విస్తరణకు జిన్‌పింగ్‌ ప్రాధాన్యమిస్తారనేది తెలిసిన విషయమే. అలాగే ఆయనది తైవాన్‌పై కఠిన వైఖరి, పాశ్చాత్య దేశాలు, ఇండియా లాంటి ఇతర దేశాలతో ఘర్షణాత్మక వైఖరి.

ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రతకు సంబంధించిన విధానాలకు జిన్‌పింగ్‌ రెట్టింపు ప్రాధాన్యత ఇస్తారని, పార్టీ కాంగ్రెస్‌కు మొట్ట మొదటి రోజునే ఇచ్చిన నివేదికలో ఇవి రెండూ కీలకమైన విష యాలుగా పేర్కొన్నప్పుడే అందరూ అంచనా వేశారు. ఆ తర్వాతి వారంలో సీపీసీ రాజ్యాంగంలో కొన్ని అంశాలను చొప్పించారు. ఈ నివేదిక రాబోయే అయిదేళ్ల కోసం మార్గదర్శక పత్రాన్ని అందజేసింది.

జాతీయ కాంగ్రెస్‌లో చేసిన రెండు గంటల ప్రసంగంలో జిన్‌పింగ్‌ ఆర్థిక విధానం, భద్రతపై సీపీసీ ప్రాధాన్యతలను వివరించారు. రాజ్యాంగంలో సైన్స్, విద్యపై కొత్త సెక్షన్లు ఉన్నాయి. చైనా భవిష్యత్‌ ప్రణాళికలో పెరిగిన వీటి ప్రాధాన్యతను ఇవి సూచించాయి. దీని సారాంశం ఏమిటంటే, ‘చైనీయ లక్షణాల’తో కూడిన ఆధునికీకరణ, పాలన అనే.
ఆర్థిక రంగం గురించి జిన్‌పింగ్‌ నొక్కి చెప్పడంలో ఉద్దేశం సైన్స్, టెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహించాలని పిలుపునివ్వడమే. 2021లో ‘ఉమ్మడి సౌభాగ్యం’ కోసం పిలుపునిస్తూ జిన్‌పింగ్‌ స్వయంగా ఇచ్చిన నినాదం... మరింత సమాన పంపిణీ వైపుగా సాంప్రదాయ చైనా ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించడమే. అయితే ఆర్థిక ప్రగతిని ప్రోత్స హించే సమగ్ర విధానం కొనసాగుతుందని జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు.

అలాగే భద్రతపై జిన్‌పింగ్‌ నొక్కి చెప్పారు. అమెరికాపై తీవ్ర విమర్శ చేశారు. అమెరికా బ్లాక్‌ మెయిల్‌ చేయడానికీ, చైనాను దిగ్బంధించడానికీ, తీవ్రమైన ఒత్తిడిని సృష్టించడానికీ ప్రయత్ని స్తోందని ఆరోపించారు. 2027 నాటికి చైనా ప్రపంచస్థాయి సైన్యాన్ని కలిగి ఉంటుందని అతిశయించి చెప్పారు. వ్యూహాత్మక అణునిరోధ కతతో పాటుగా, నూతన పోరాట సామర్థ్యాలను సంతరించుకున్న కొత్త ప్రాదేశిక శక్తులను ప్రవేశపెడతామని చెప్పారు. 

భారత దృక్కోణం నుంచి చూస్తే– పీఎల్‌ఏ(సైన్యం) ఆధునీకరణ అంటే చైనా  భద్రతాస్థితిని మెరుగుపరిచి, సంక్షోభాలను నిలువరించి, స్థానిక యుద్ధాలను గెలవడమే. ఇది కచ్చితంగా తైవాన్, భారత్‌లతో చైనాకున్న సమస్యలను ప్రస్తావిస్తోందంటే సందేహించవలసిన పనిలేదు. గల్వాన్‌ లోయలో భారత్‌ సైన్యంతో ఘర్షణలకు సంబంధిం చిన క్లిప్పులను కాంగ్రెస్‌ ప్రతినిధులకు ప్రదర్శించి చూపారంటే, చైనా విధాన నిర్ణేతల మనసుల్లో భారత్‌కు ఉన్న ప్రాధాన్యత ఏమిటో నిర్ధారణ అవుతోంది.

అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి పదవీ కాలాలకు పరిమితి విధించడమనే భావనకు చరిత్రలోకి మళ్లాలి. దానికి జూలియస్‌ సీజర్, నెపోలియన్‌ వంటి శక్తిమంతుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. అయితే ఎనిమిది లేదా పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న నేతలు అలసిపోతారని ఆధునిక అనుభవం సూచిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, ఇరాన్‌ సుప్రీం అధినేత అయతుల్లా ఖొమైనీ, ఉత్తర కొరియా కిమ్‌ జోంగ్‌ ఉన్, ఇంకా పలువురు ఆఫ్రికన్‌ ప్రభుత్వాధినేతల పాలనా రికార్డు దీన్నే నిరూపిస్తోంది. 

సామూహిక నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి డెంగ్‌ జియావో పింగ్‌ చేసిన ప్రయత్నాల్లో నిశ్చయమైన విజ్ఞత ఉంది. ఏక నాయకుడి అధికారాన్ని తనిఖీ చేసే ప్రయత్నమది. అయితే ఇలాంటి ఆంక్షలను జిన్‌పింగ్‌ తొలగించేశారు. తన అధికారం మీద ఏ తనిఖీ లేని తిరుగు లేని అధినేత పాలన తెచ్చే పర్యవసానాలను చైనా మరోసారి ఎదుర్కో వలసి ఉంటుంది.


మనోజ్‌ జోషి, వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top