డిజిటల్‌ అగ్రగామిగా భారత్‌!

Sakshi Guest Column On Digital India

ఆధార్, ఏకీకృత చెల్లింపు వ్యవస్థలు, డేటా పంపిణీ... ఈ మూడూ కలిసి భారత్‌ను ‘ప్రపంచ డిజిటల్‌ అగ్రగామి’గా నిలబెట్టాయని ‘స్టాకింగ్‌ ఆఫ్‌ ది బెనిఫిట్స్‌ : లెసన్స్ ఫ్రమ్‌ ఇండియాస్‌ డిజటల్‌ జర్నీ’ అనే శీర్షికతో తాజాగా విడుదల చేసిన కార్యాచరణ పత్రంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వెల్లడించింది.

ఈ డిజిటల్‌ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ని ఉపయోగించడం ద్వారానే భారత్‌ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందివ్వగలిగిందని, డిజిటల్‌ అకౌంట్‌ అగ్రిగేటర్‌ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్నింకా వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం ప్రశంసించింది.

అదే సమయంలో భారత్‌లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్‌ఎఫ్‌ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడటానికి డేటా ఉల్లంఘనలకు పాల్పడిన వారిని జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్టం రూపకల్పన తప్పనిసరి అని సూచించింది.
 

మానవ జీవితాలను, ఆర్థిక వ్యవస్థను మార్చి వేస్తున్న ప్రపంచ స్థాయి డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్ ఫ్రాస్ట్ర క్చర్‌ని భారతదేశం నిర్మించిందని, ఇది అనేక దేశాలు అనుసరించాల్సిన పాఠం అవుతుందని తాజా ఐఎమ్‌ఎఫ్‌ కార్యాచరణ పత్రం పేర్కొంది. ‘ఇండియా స్టాక్‌’ అనేది భారత్‌లో సాధారణంగా ఉపయోగిస్తున్న డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐలు) సెట్‌కి సామూహిక పేరు. దీంట్లో మూడు విభిన్నమైన పొరలు ఉంటున్నాయి. అవి, 1. ప్రత్యేక గుర్తింపు (ఆధార్‌), 2. కాంప్లిమెంటరీ చెల్లింపు వ్యవస్థలు (ఏకీకృత చెల్లింపు ఇంటర్‌ఫేస్, ఆధార్‌ పేమెంట్స్‌ బ్రిడ్జ్, ఆధార్‌ ఆధారిత పేమెంట్‌ సర్వీస్‌), 3. డేటా పంపిణీ (డిజీలాకర్, అకౌంట్‌ అగ్రిగేటర్‌).

ఇవన్నీ కలిసి అనేక పబ్లిక్, ప్రైవేట్‌ సేవలకు.. ఆన్ లైన్, కాగిత రహిత, నగదు రహిత, గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే డిజిటల్‌ సంప్రాప్య తను కల్పించాయని ‘స్టాకింగ్‌ ఆఫ్‌ ది బెనిఫిట్స్‌ : లెసన్స్ ఫ్రమ్‌ ఇండియాస్‌ డిజటల్‌ జర్నీ’ అనే శీర్షికతో కూడిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కార్యాచరణ పత్రం తెలిపింది. ఈ మదుపు ప్రయో జనం భారత్‌ వ్యాప్తంగా అనుభవంలోకి రావడమే కాకుండా కోవిడ్‌ 19 మహమ్మారి కాలంలో దేశానికి ఎంతో సేవచేసిందని ఆ పత్రం వెల్లడించింది.

ప్రభుత్వ ఖజానా నుంచి లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంటుకు నేరుగా సామాజిక భద్రతా చెల్లింపుల పంపిణీని సులభతరం చేయడంలో ఆధార్‌ సహక రించిందని అది పేర్కొంది. దీనివల్ల లీకేజీలను తగ్గించడం, అవినీతిని అరికట్టడం, విస్తృతిని పెంచడం, సమర్థంగా కుటుంబాల వద్దకు చేరు కోవడానికి ఒక సాధనాన్ని అందించడంలో ఇది సహకరించింది అని వ్యాఖ్యానించింది. 

విస్తృతంగా డిజిటల్‌ చెల్లింపులు
డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇతర ప్రభుత్వ సంస్కరణల కారణంగా 2021 మార్చి వరకు జీడీపీలో 1.1 శాతం వ్యయాన్ని ఆదా చేసినట్లు భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ డిజిటల్‌ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ని ఉపయోగించడం ద్వారా భారత్‌ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందించగలిగింది.

మహమ్మారి ఆవహించిన తొలి నెలల కాలంలో నిరుపేద కుటుంబాల్లో 87 శాతం కనీసం ఒక లబ్ధి పథకాన్నయినా అందుకున్నారు. సృజనాత్మక ఆవిష్కరణను, పోటీని పెంచడానికి, మార్కెట్లను విస్తరించడానికి, ప్రభుత్వ ఆదాయ సేకరణను పెంచుకోవడానికి, ప్రభుత్వ వ్యయ సమర్థతను మెరుగుపర్చుకోవడానికి ఇండియా స్టాక్‌ ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడింది. డిజిటల్‌ చెల్లింపులు ఇప్పుడు సర్వవ్యాప్తమయ్యాయి.

దేశంలో అన్ని చెల్లింపుల లావాదేవీల్లో యూపీఐ చెల్లింపులు 68 శాతంగా ఉన్నాయి. డిజిటల్‌ చెల్లింపుల ఉపయోగం చిన్న వర్తకుల కస్టమర్‌ పునాదిని విస్తరించింది, వారి నగదు ప్రవాహాన్ని నమోదు చేసి, ద్రవ్య సంప్రాప్యతను మెరుగుపర్చింది.

పెరిగిన ప్రభుత్వ రాబడి
2021 ఆగస్టులో మొదటిసారి ప్రారంభించి నది మొదలు ‘అకౌంట్‌ అగ్రిగేటర్‌’ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్ని వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం తెలిపింది. డిజిటలీకరణ అనేది ఆర్థిక వ్యవస్థ అధికారికీకరణను కూడా బలపర్చింది. 2017 జూలై నుంచి 2022 మార్చి మధ్యలో జీఎస్టీ కోసం 88 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వ రాబడులు గణనీయంగా పెరిగాయి.

ప్రభుత్వ సర్వీస్‌ ప్రొవిజన్‌ను కూడా క్రమబద్ధీకరించారు. ఉదాహరణకు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్లను ఒకే ప్లాట్‌ ఫామ్‌ ద్వారా పౌరులు పొందవచ్చు. అదేవిధంగా, ఇండియా స్టాక్‌ ‘నో యువర్‌ కస్టమర్‌’ నిబంధ నలను డిజిటలీకరించి, సులభతరం చేసింది. ఖర్చు లను తగ్గించింది. ఇ–కేవైసీని ఉపయోగిస్తున్న బ్యాంకులు సమ్మతి ఖర్చును 12 అమెరికా డాలర్ల నుంచి 6 అమెరికన్‌ సెంట్లకు తగ్గించుకున్నాయి.

మహిళలే లక్ష్యంగా జన్‌ధన్‌
ఖర్చుల్లో ఈ తగ్గుదల తక్కువ ఆదాయం ఉన్న  క్లయింట్‌లు కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కోసం సేవలను మరింతగా ఆకర్షిస్తూ, లాభాలు ఆర్జించడానికి వీలు కల్పించింది. ఆర్థిక అభివృద్ధిలో అందర్నీ భాగస్వామ్యం చేయడానికి సంబంధించి ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ ఆ పత్రం ఇలా చెప్పింది. ‘‘తక్కువ ఖర్చుతో కూడిన బ్యాంక్‌ ఖాతాకు అవకాశం కల్పించడం వల్ల బ్యాంక్‌ ఖాతా లతో వ్యక్తుల కవరేజీ రెట్టింపు అయింది. జన్ ధన్‌ పథకం ఆర్థికంగా అర్హత లేనివారిని, ప్రత్యేకించి గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకుంది.

ఈ పథకం కింద 2022 ఆగస్టు నాటికి 46 కోట్లకు పైగా బ్యాంక్‌ ఖాతాలను పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తెరిచారు. డిజిటల్‌ బ్యాక్‌బోన్ ను ఉపయోగించడం వల్ల భారత్‌ తన వ్యాక్సిన్‌ పంపిణీని శరవేగంగా చేయగలడమే కాదు... భారీస్థాయి అంతర్గత వలసలు వంటి సవాళ్లను అధిగమించింది’’ అని ఐఎమ్‌ఎఫ్‌ కార్యాచరణ పత్రం పేర్కొంది. కో–విన్ లో పొందుపర్చిన టెక్నాలజీని ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జమైకాలలో కూడా అమలు పర్చారు. ఇది ఆయా దేశాల వ్యాక్సినేషన్‌ ప్రోగ్రాంను సులభతరం చేసింది.

డేటా పరిరక్షణ తప్పనిసరి
సవాళ్ల విషయానికి వస్తే, భారత్‌లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్‌ఎఫ్‌ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడ టానికి; కంపెనీలు, ప్రభుత్వాలు విచక్షణారహితంగా డేటా సేకరించడాన్ని నిరోధించడానికి; డేటా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలు, ప్రభు త్వాలను జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్ట రూపకల్పన తప్పనిసరి. సముచితమైన రీతిలో డేటా నిర్వహణకు, సైబర్‌ భద్రత రంగంలో తగిన మదుపులు పెట్టడానికి ఇది చాలా అవసరం.

సామాజిక సహాయం మరింత దృఢంగా, స్వీకరించదగినదిగా చేసే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విషయంలో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) కూడా సహకరిస్తుంది. ఉదాహరణకు, రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ పథకాల మధ్య డేటా పంపిణీకి ఆధార్‌ను ఉపయోగించవచ్చని ఐఎమ్‌ఎఫ్‌ కార్యాచరణ పత్రం పేర్కొంది.

చివరగా, డీపీఐ (డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)ని ప్రభావితం చేయడానికి కాలక్రమాలు, నాణ్యత, సాధారణ ప్రభుత్వ ద్రవ్య నివేదికల కవరేజీ వంటివాటిని భారత్‌ గణనీయంగా మెరుగుపర్చుకుంది. అదే సమయంలో తన పౌరుల కోసం ప్రభుత్వ రంగ జవాబుదారీతనాన్ని మెరుగుపర్చుకోవడంలో ద్రవ్యపరమైన పారదర్శకతను విస్తరించడం అనేది కీలక అంశంగా ఉంటోంది.
– ఎమ్‌. ముఖేశ్‌ రాణా, ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top