ఆయిల్‌ పామ్‌ సాగుపై అపోహలు వద్దు

Oil Palm Cultivation No Misgiving In TS Guest Column By PRO Sandeep Reddy - Sakshi

సందర్భం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిం చిన తరువాత, దశలవారీగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి, వ్యవసాయం అంటే దండగ అనే భయంతో ఉన్న రైతాంగాన్ని ధైర్యంగా వ్యవసాయం చేసే దిశగా ఆత్మవిశ్వాసం పెంపొందించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. దీంతో 2014కు ముందు ఆకలిబాధలతో తండ్లాడిన తెలంగాణ ఇప్పుడు దేశానికి అన్నపూర్ణగా నిలిచింది. గత ఏడాది వానాకాలం, యాసంగి కలిపి ఏకంగా 3 కోట్ల టన్నుల పైచిలుకు వరి ధాన్యం పండించడం గమనార్హం. 

సంప్రదాయ పంటల సాగు నుండి ప్రత్యామ్నాయ పంట లవైపు నడిపించే ప్రయత్నంలో భాగంగా– ప్రధానంగా ఆయిల్‌ పామ్‌ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని, తెలంగాణలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగును  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. ఈ నేప థ్యంలో కొందరు వ్యవసాయ నిపుణులు, మేధావులు ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రోత్సాహాన్ని తప్పుపడుతూ అనేక వాదనలు వివిధ మాధ్యమాల ద్వారా వినిపిస్తున్నారు. 

దేశంలో ప్రతి ఏటా 22 మిలియన్‌ టన్నుల వంట నూనెలను వినియోగిస్తుండగా కేవలం ఏడు టన్నుల వంటనూనెలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మిగిలిన 15 టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది. ఈ మొత్తం దిగుమతులలో దాదాపు 60 శాతం పామాయిల్‌ను సుమారు రూ. 60 వేల కోట్ల నుండి రూ.70 వేల కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది.  దేశంలో ప్రస్తుతం 8.25 లక్షల ఎకరాలలో మాత్రమే ఆయిల్‌ పామ్‌ సాగవుతుండగా, ఏడాదికి 16.85 లక్షల మెట్రిక్‌ టన్నుల గెలల నుండి 2.81 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తి అవుతున్నది.

తెలంగాణలో 49 వేల ఎకరాలలో సాగవుతుండగా ఏడాదికి 39 వేల మెట్రిక్‌ టన్నుల ముడి పామాయిల్‌ ఉత్పత్తి అవుతున్నది. తెలంగాణ రాష్ట్ర జనాభాకు ఏడాదికి 3.66 లక్షల టన్నుల పామ్‌ ఆయిల్‌ అవసరం. ఈ దేశ అవసరాల మేరకు పామాయిల్‌ ఉత్పత్తి జరగాలంటే దేశం మొత్తంలో కనీసం 70 లక్షల ఎకరాలలో దీన్ని సాగు చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా అది దేశ అవసరాలకు మాత్రమే సరిపోతుంది. 

స్థానిక, జాతీయ అవసరాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే రైతులను ఈ వైపు ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు తెలంగాణలో ఆయిల్‌ పామ్‌ సాగుకు అనువైన జిల్లాలను గుర్తిం చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం డాక్టర్‌ బీఎంసీ రెడ్డి అధ్యక్షతన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రీసెర్చ్‌ సైంటిస్టులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2019 నవంబర్‌లో తెలంగాణలో పర్యటించి తెలంగాణలోని 25 జిల్లాలు ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలమని నివేదిక ఇచ్చింది.   

ప్రధానంగా వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌ పామ్‌ సాగును రైతుకు 50 శాతం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలని కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు. ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్‌ పామ్‌ను ఎంచుకోవడానికి కూడా కారణం ఉంది. ఈ దేశంలో రైతుకు బై బ్యాక్‌ గ్యారంటీ పాలసీ ఉన్న ఏకైక పంట ఆయిల్‌ పామ్‌ మాత్రమే. పైగా పెట్టుబడి తక్కువ. చీడ పీడలు, కోతులు, అడవి పందుల బెడద ఉండదు. మొక్క నాటిన నాటి నుండి నాలుగేళ్ల వరకు ఆరుతడి అంతర పంటలను వేసుకోవచ్చు. పంట జీవితకాలం 30 ఏళ్ల వరకు అందులో అదనంగా కోకోవ పంటను సాగు చేసుకోవచ్చు. తెలంగాణ ఆయిల్‌ పామ్‌ సాగువైపు దృష్టి సారించిన తర్వాతే కేంద్రం ఈ దిశగా దేశ రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు  రూ.11,040 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ పరిణామాల క్రమంలో పలువురు వ్యవసాయ నిపు ణులు, రైతు సంఘాల నేతలు–ఈ సాగులోని పర్యావరణ కార ణాలను, వంట నూనెల కల్తీని, భూగర్భ జలాల వాడకాన్ని ఎత్తి చూపుతూ, తెలంగాణ వాతావరణ పరిస్థితులు అనుకూలం కావని, దేశంలోని కొద్ది మంది భూస్వాములకే ఈ పంట సాగు ప్రయోజనం చేకూరుస్తుందని పలు రకాల అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. దీన్ని ప్రజలు ఆదరించడం లేదని, కేవలం సౌందర్య ఉత్పత్తులు, జంక్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, షాంపూ, డిటర్జెంట్, టూత్‌ పేస్టులు, కొవ్వొత్తుల తయారీలోనే వినియోగిస్తున్నారని చెబుతున్నారు. 

అయితే దేశంలో, ప్రపంచంలో వ్యాపారం జరుగుతున్న అనేక ఉత్పత్తులు ఆయిల్‌ పామ్‌ ఉప ఉత్పత్తుల ద్వారానే తయా రవుతున్నాయి. దీని ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు దీని సాగు వద్దనడంలో సహేతుకత ఎక్కడుంది? తెలంగాణ ప్రభుత్వం నువ్వులు, వేరుశనగ, కుసుమ, సోయా వంటి నూనెగింజల సాగు వైపు సన్న, చిన్నకారు రైతులను ప్రోత్సహిస్తూనే ఆయిల్‌ పామ్‌ సాగును కూడా ప్రోత్సహిస్తున్నది. తెలంగాణలో యాసంగి పంట అయిన వేరు శనగను దాదాపు 5 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. దీనిని దాదాపు 20 లక్షల ఎకరాలకు పెంచినా మార్కెట్‌ డిమాండ్‌ తగ్గదనే లక్ష్యంతో తెలంగాణ వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. దేశంలో అత్యధికంగా 50 లక్షల ఎకరాలలో వానాకాలం పంటగా వేరుశనగను గుజరాత్‌లో సాగు చేస్తారు. అయితే ఆఫ్లాటాక్సిన్‌ (శిలీంధ్రం) ఉన్నందున అక్కడి పంటకు అంతర్జాతీయ డిమాండ్‌ అంతగా లేదు. తెలంగాణ వేరుశనగ పంట ఆప్లాటాక్సిన్‌ రహి తంగా ఉన్నట్లు ఇక్రిశాట్‌ పరిశోధనలలో వెల్లడైంది. దీనికి అంత ర్జాతీయంగా ఆదరణ ఉంది. అందుకే దీనిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించారు.

విదేశాల నుండి తెచ్చుకుంటున్న వంటనూనెల దిగుమతిని తగ్గించుకునే క్రమంలో దేశంలో 70 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు చేసినప్పుడు మాత్రమే మన దేశం పామాయిల్‌ దిగుమతి విషయంలో స్వయంసమృద్ధి సాధించినట్లు అవుతుంది. 70 లక్షల ఎకరాలలో ఇది సాగయినప్పటికీ ఇతర వంటనూనెల సాగును ప్రోత్సహించాల్సిందే. ఇది వంటనూనెలలో ఒక భాగం మాత్రమే. ఇన్నేళ్లూ ఈ దిశగా ప్రోత్సహించకపోవడం తప్పిదం. ఇప్పుడు ప్రోత్సహిస్తుంటే అభినందించకుండా వ్యతిరేకించడం శోచనీయం.
ఆయిల్‌ పామ్‌ సాగు మూలంగా భూస్వాములకే లాభం అనే వాదన అసంబద్ధమైనది. దేశంలో సీలింగ్‌ వ్యవస్థ వచ్చిన తర్వాత భూస్వాములు లేరు. 54 ఎకరాల వరకే ఒక రైతు మీద భూమి ఉంటుంది. అంతకుమించి ఉండేది కంపెనీల పేరు మీదనే.  తెలంగాణలో వ్యవసాయభూమి కోటి 50 లక్షల ఎకరాలు. ఇందులో చిన్న, సన్నకారు రైతులే 91.48 శాతం. ఈ విషయాలు తెలిసి కూడా ఆరోపణలు చేస్తుండటం గర్హనీయం.

తెలంగాణలో అత్యధిక శాతం ఊష్ణోగ్రతలు కలిగి ఉండే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఆయిల్‌ పామ్‌ సాగు అధికంగా ఉంది. అంతకన్నా తక్కువ ఊష్ణోగ్రతలు ఉండే ప్రాంతంలో ఇది పండదు అనే వాదన అర్థరహితం. ఒక ఎకరా వరి సాగుకు అవసరమైన నీటితో 4 ఎకరాల ఆయిల్‌ పామ్‌ సాగుచేయవచ్చు. దీని మూలంగా మొదటి ఏడాది రూ. 23 వేలు, రెండో ఏడాది రూ. 22 వేలు, మూడో ఏడాది రూ. 20 వేలు, నాలుగో ఏడాది రూ. 16,800 విద్యుత్‌ ఖర్చు ఆదా చేయవచ్చని నిపుణుల అంచనా. పైగా ఇతర పంటలకు లేనివిధంగా ఆయిల్‌ పామ్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం గెలలు కొని, పదిహేనురోజులకు ఒకసారి డబ్బు రైతుల ఖాతాలలో జమయ్యే అవకాశం ఒక్క ఈ పంటకే ఉంది.

ఇది పాత తెలంగాణ కాదు. ఈ దేశానికి కొత్త దారిని చూపే శక్తిని సంతరించుకున్న తెలంగాణ. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమపార్టీ ప్రభుత్వానికి తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్లాలో అవగాహన ఉంది. దురభిప్రాయాల వ్యాప్తిని ఆపితే మంచిది.
-సందీప్‌రెడ్డి కొత్తపల్లి
వ్యాసకర్త తెలంగాణ వ్యవసాయ మంత్రివద్ద ప్రజా సంబంధాల అధికారి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top